శ్రీ‌వారి దర్శ‌నానికి రేష‌న్ పెడ‌తార‌ట‌!

Update: 2018-01-26 05:05 GMT
రోజులు గ‌డిచే కొద్దీ ప‌రిస్థితులు మ‌రింత సౌల‌భ్యంగా ఉండాలి. కానీ.. పాల‌కుల పుణ్య‌మా అని అలాంటిదేమీ లేక‌పోగా.. కొత్త కొత్త స‌మ‌స్య‌లు తెర మీద‌కు వ‌స్తుండ‌టం ఆశ్చ‌ర్యానికి గురి చేసే ప‌రిస్థితి. ఇప్ప‌టికే ఎన్నో ప‌రిమితుల మ‌ధ్య బ‌తికేస్తున్న స‌గ‌టు జీవికి మ‌రిన్ని క‌ట్టుబాట్లు పెట్టేయాల‌న్న ఆలోచ‌న‌లో పాల‌కులు రావ‌టం చూస్తే.. ఇదేంటి? అన్న సందేహం రాక మాన‌దు.

మ‌న‌సు బాగోన‌ప్పుడు ఏ గుడికో వెళ్లాల‌నుకోవ‌టం చాలామంది చేసే ప‌ని. లేదంటే.. ఏదైనా మంచి ప‌ని షురూ చేయాల‌నుకున్న‌ప్పుడు.. ఇంట్లో శుభ‌కార్యం జ‌రిగిన‌ప్పుడు.. కొత్త‌గా ఏదైనా స‌మ‌స్య‌లో ప‌డిన‌ప్పుడు దైవ ద‌ర్శ‌నం గురించి ఆలోచిస్తుంటారు. అయితే.. అలాంటి ద‌ర్శ‌నం మీద రేష‌న్ పెట్టాల‌న్న ద‌రిద్ర‌పుగొట్టు ఆలోచ‌న చేస్తున్న ఏపీ పాల‌కుల వైఖ‌రి చూస్తే అవాక్కు అవ్వాల్సింది.

ఏపీ మంత్రి మాణిక్యాల రావు తాజాగా ఒక చిత్ర‌మైన ముచ్చ‌ట చెప్పారు. తెలుగు వారితో స‌హా.. దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన వారి మొద‌లు.. విదేశీయులు సైతం ఎంతో మ‌క్కువ ప్ర‌ద‌ర్శించే తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ప‌రిమితులు పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెప్ప‌టం షాకింగ్ గా మారింది. తిరుమ‌ల వెంక‌న్న‌ను ఏడాదికి రెండు సార్లు మాత్ర‌మే ద‌ర్శ‌నం చేసుకునేలా ప‌రిమితి విధించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ప్ర‌స్తుతం 70 నుంచి 90 వేల మంది భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకుంటున్నార‌ని.. రోజూ ద‌ర్శ‌నం ల‌భించ‌ని భ‌క్తులు 30 వేల మంది వ‌ర‌కున్నార‌ని.. ఈ నేప‌థ్యంలో అన్ని ద‌ర్శ‌నాల‌ను ఆధార్ తో అనుసంధానం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెప్పారు.

భ‌విష్య‌త్తులో ఎప్పుడు  అనుకుంటే అప్పుడు తిరుమ‌ల‌కు రావ‌టం కుద‌ర‌ద‌ని..త‌మ‌కు కేటాయించిన టైంలోనే వెళ్లి ద‌ర్శ‌నం చేసుకునేలా ఏర్పాట్లు చేయాల‌ని కూడా భావిస్తున్న‌ట్లు మంత్రి చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఎప్పుడు.. ఎన్ని గంట‌ల‌కు రావాలో చెప్పాల‌ని ప్లాన్ చేస్తున్న మంత్రి.. ఎలా దండం పెట్టుకోవాలో కూడా చెప్పేస్తారేమో?  దేవుడి ద‌ర్శ‌నం విష‌యంలో సామాన్యుడికి ఇన్ని పరిమితులు పెట్టాల‌ని ఆలోచించే మంత్రిగారు.. వీవీఐపీలు.. వీఐపీల విష‌యంలో ఈ ప‌ని చేస్తే బాగుంటుంది. ప్ర‌తిదానికి సగ‌టుజీవినే టార్గెట్ చేయాల‌న్న ఆలోచ‌న‌ను మంత్రితో పాటు.. ఏపీ ప్ర‌భుత్వం వ‌దిలేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దేవుడి ద‌ర్శ‌నానికి కూడా రేష‌న్ ఏంది మంత్రిగారు?  బాబు.. మీ రాజ్యంలో మీ మంత్రి చేస్తున్న ఆలోచ‌న మీ దృష్టికి వ‌చ్చిందా?


Tags:    

Similar News