రిజర్వేషన్లు వారికే ఇవ్వాలంటున్నారు

Update: 2015-09-22 06:40 GMT
కొన్ని అంశాల విషయంలో మాట్లాడేందుకు రాజకీయ నేతలు ససేమిరా అంటుంటారు. దేశంలో అమలు చేసే రిజర్వేషన్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. మేధావులు సైతం అంగీకరించే ఆర్థిక వెనుకబాటుకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఉన్నా.. దాన్ని అమలు చేసే విషయంలో మాత్రం రాజకీయ పక్షాలు మాత్రం ససేమిరా అంటుంటాయి.

రిజర్వేషన్లను కుల ఓటుబ్యాంకులుగా భావించటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉంటాయి తప్పించి.. రిజర్వేషన్లపై శాస్త్రీయ దృక్ఫదాన్ని మాత్రం ప్రదర్శించవు.  వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని.. కాకుంటే రిజర్వేషన్ల అంశాన్ని ప్రతి పదేళ్లకు ఒకసారి సమీక్షించాలని రాజ్యాంగంలో పేర్కొన్నా.. నేతలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోయినట్లు కనిపించరు.

డిజిటల్ యుగంలోనూ రిజర్వేషన్లను కులం ఆధారంగా తప్పించి.. ఆర్థిక వెనుకబాటును ఆధారంగా చేపట్టాలన్న విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నా.. రాజకీయ పార్టీలు మాత్రం అందుకు అంగీకరించటం లేదు. కులాల వారీగా.. మతాల వారీగా చీలిపోయిన సమాజం.. ఉన్నోళ్లు.. లేనోళ్లుగా గ్రూపులు అయితే ఏదైనా కదలిక ఉంటుందేమో.

అలాంటిది ఆచరణలో సాధ్యం కాని నేపథ్యంలో ఆర్థిక అంశాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ చేసే పార్టీలు ఉండకపోవచ్చు. ఈ మధ్యనే ఆర్ ఎస్ ఎస్ చీఫ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వెంటనే.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. దాన్నిసర్దిపుచ్చుకునేందుకు కేంద్రమంత్రి మనీష్ తివారి ఆర్థిక రిజర్వేషన్ల పల్లవి అందుకున్నారు.

21వ శతాబ్దంలోనూ రిజర్వేషన్లు ఇవ్వటం ఏమిటంటూ ప్రశ్నించిన ఆయన.. రిజర్వేషన్లు అవసరం అనుకుంటే కులం ప్రాతిపదికగా కాకుండా.. ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఇవ్వాలని సూచన చేశారు. మరి.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్య అయినా అధికారపక్షం కళ్లు తెరిపించే అవకాశం ఉందా?
Tags:    

Similar News