తెదేపానుంచి వలసలు మొదలౌతాయా?

Update: 2018-02-03 04:22 GMT
తెలుగుదేశం పార్టీ గురించి ఎవరికైనా ఎలాంటి భ్రమలైనా మిగిలి ఉంటే అలాంటివన్నీ ఇక తొలగిపోతున్నట్టే! సూర్య కాంతి రాగానే కమ్ముకున్న మంచుపొరలు తొలగిపోయినట్లుగా.. బడ్జెట్ రాగానే - బడ్జెట్ కేటాయింపులపై తెలుగుదేశం స్పందిస్తున్న తీరు చూడగానే.. చాలా మంది నాయకులకు కళ్ల ముందు కమ్ముకున్న మబ్బులు తొలగిపోతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగుదేశాన్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతామేమో అనే భయం కలుగుతోంది. తమ అచేతనత్వంతో ప్రజాగ్రహం పెరగడానికి చేజేతులా బాటలు వేసుకుంటున్న తెలుగుదేశం ముందుముందు మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే అనే అభిప్రాయాలు కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం నుంచి ఏకైక ఆల్టర్నేటివ్ గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు మొదలైనా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు పనిగట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ను బలహీన పరచడం ఒక్కటే లక్ష్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తాయిలాలు చూపించి - కేసుల భయాలు చూపించి... తమ పార్టీలో చేర్చుకున్నారు. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి.. ప్రత్యర్థి మీద పైచేయి సాధించడానికి ప్రయత్నించారు. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీకి ప్రజల వద్ద ఉన్న గుర్తింపు కూడా మంటగలిసిపోతున్నదనే సంగతిని ఆ పార్టీ నాయకులే గుర్తిస్తున్నారు.

నాలుగేళ్ల కాలంలో మాటలు చెప్పడం తప్ప.. నిర్దిష్టంగా జరిగిన పని అంటూ ఏదీ ప్రజలకు కనిపించడం లేదు. ఏవైతే కొత్త ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారో.. అవేమీ నెరవేరలేదు. కనీసం కేంద్రాన్ని ప్రశ్నించే తెగువ - ధైర్యం కూడా లేని ప్రభుత్వం తయారైందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిపోయింది. ఇలాంటి స మయంలో అసలే కొత్త వలసలు వచ్చి చాలా నియోజకవర్గాల్లో పార్టీలో ముఠాలు పెరిగిపోయాయి. అసలే ప్రజల్లో తమ పట్ల విముఖత పెరిగిపోతుండగా.. మళ్లీ నియోజకవర్గాల్లో కుమ్ములాటల్ని తట్టుకుంటూ మనగలగడం అసాధ్యం అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. తెదేపాలోనే ఉండాల్సి వస్తే.. మౌనంగా ఉండడం, ఎన్నికల వంటి ఆశలు ఉంటే ఇతర పార్టీల్లోకి వెళ్లడం బెటరనే అభిప్రాయం కొందరిలో కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెదేపా నుంచి బయటకు వలసలు ప్రారంభం అయినా ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ పరిణామాలకు ముందే నెల్లూరులో తెదేపా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పార్టీ మారడం కూడా కొందరికి పునరాలోచన కలిగించినట్లు తెలుస్తోంది.  

Tags:    

Similar News