మావోయిస్టుల ప్రధాన టార్గెట్ గా లోకేశ్?

Update: 2016-10-27 07:04 GMT
 భారతదేశంలోనే అతి పెద్ద ఎన్ కౌంటర్లలో ఒకటైన సోమవారం నాటి మల్కన్ గిరి ఎన్‌ కౌంటర్‌ లో 28మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఏఓబిలో మావోయిస్ట్‌ లు తుడిచిపెట్టుకుపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే... మావోయిస్టులు మాత్రం దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నారని... ముఖ్యమంత్రి చంద్రబాబు - ఆయన తనయుడు లోకేశ్ లు విశాఖ మన్యంలో బాక్సైట్ ను కొల్లగొట్టే ప్రయత్నంలో తమను అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల తమ హిట్ లిస్టులో లోకేశ్ ను నంబర్ 2గా రికార్డు చేశారని అనుమానిస్తున్నారు.

మరోవైపు  మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పేరుతో బుధవారం ఒక లేఖ విడుదలైంది.. సోమవారం జరిగిన ఎన్‌ కౌంటర్ కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని - ఆయన్ని, కుమారుడు లోకేష్‌ ని వదిలిపెట్టబోమని అందులో హెచ్చరించారు. కోవర్టులను వినియోగించి  ఆహారంలో మత్తు - విష పదార్థాలను కలిపించి - రాత్రి భోజనం చేసిన తరువాత ఒక్కొక్కరు పడిపోయిన తరువాత వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని ఆ లేఖలో ఆరోపించారు. అయితే... దాడులు ఎలా చేస్తామన్నది కూడా ఆ లేఖలో ఉండడంతో దానిపై అనుమానాలు ఉన్నాయి. మావోయిస్టులు తమ వ్యూహాలు ముందుగా బయటపెట్టరని... కానీ, అందుకు భిన్నంగా అవసరమైతే ఆత్మాహుతి దాడిచేస్తామని లేఖలో పేర్కొనడంతో అది పార్టీ నుంచి వచ్చిన అధికారిక లేఖ కాకపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు.

కానీ, లేఖ నిజమైనదా కాదా అన్నది పక్కనపెడితే లోకేశ్ ను మావోయిస్టులు టార్గెట్ చేయడంలో నిజం ఉందని పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. విశాఖ మన్యంలోని బాక్సైట్ నిక్షేపాల విషయంలో లోకేశ్ గట్టి పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. అపారమైన నిక్షేపాలను వృథాగా వదిలేయడం ఎందుకన్నది ఆయన ఆలోచన. ఎలాగైనా వాటితవ్వకాలు జరిపించాలని చంద్రబాబుపైనా లోకేశ్ ఒత్తిడి చేస్తున్నారని.. తాను కూడా స్వయంగా అందుకు తగ్గ వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగమే  ఈ ఎన్ కౌంటర్ అన్న వాదనా ఉంది. అందువల్లే మావోయిస్టులు లోకేశ్  ను తమ టార్గెట్ గా పెట్టకున్నారని అనుమానిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News