ఎమ్మెల్యే...ఎమ్మెల్సీ...మంత్రి...ఎంపీ...?

Update: 2022-02-01 03:30 GMT
అవును. ఇవన్నీ పదవులే. దర్జాను ఒలకబోసే పదవులే. నాయకులు కోరుకునేవి, అధినాయకుడు వరంగా ఇచ్చేవి ఇలాంటి పదవులే. ఇంతకీ ఈ పదవుల గురించి చాలా ఏళ్ళుగా  వింటూ కాగితం మీద మాత్రమే పంచదార తీపిని ఆస్వాదిస్తున్న ఒక బ్యాడ్ లక్ పొలిటీషియన్ వైసీపీలో  ఉన్నారు. ఆయనే గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్. ఆయన 2004లో చిలకలూరిపేట నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు. అతి తక్కువ మెజారిటీ నాడు దక్కింది. ఆయన వైఎస్సార్ చలువతో కాంగ్రెస్ లో చేరి అధికార ఎమ్మెల్యేగా వెలిగారు. ఇక 2009 నాటికి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసినా, 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద బరిలోకి దిగినా గెలుపు పిలుపు వినలేదు

ఇక 2019 వచ్చేసరికి ఆయనకు ఏకంగా టికెట్టే గల్లంతు అయింది. బీసీ వర్గానికి చెందిన విడుదల రజనీకి జగన్ టికెట్ ఇచ్చి కమ్మ వారి ప్రాబల్యం ఉన్న చిలకలూరిపేటలో బీజీ జెండాను ఎగరేశారు. ఈ రకమైన సామాజిక సమీకరణల వల్ల మర్రి రాజశేఖర్ కి టికెట్ దక్కలేదు. నాడు జగన్ ఆయంకు ఇచ్చిన హామీ ఏంటి అంటే ఎమ్మెల్సీని చేస్తామని, ఆ తరువాత నేరుగా  మంత్రిని చేస్తామని.

దాన్ని నమ్మిన ఆయన విడుదల రజనీ గెలుపునకు బాగా కృషి చేశారు. ఇక రజనీ గెలిచిన తరువాత తన వర్గాన్ని పేటలో అభివృద్ధి చేసుకున్నారు. రాజశేఖర్ వర్గానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో అధినాయకత్వం కూడా రజనీకే మద్దతుగా ఉందని రాజశేఖర్ వర్గీయులు అనుమానిస్తూ వచ్చారు. ఈ మధ్యలో రెండు మూడు విడతలుగా ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ అయ్యాయి. కానీ రాజశేఖర్ కి మాత్రం చాన్స్ దక్కలేదు. తాజాగా అదే కమ్మ సామాజికవర్గానికి చెందిన తలశిల రఘురాం కి ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్ రాజశేఖర్ ని పక్కన పెట్తేసారని విమర్శలు వచ్చాయి.

దీంతో ఈ రాజకీయాలతో విసిగిన ఆయన తన పూర్వాశ్రమం అయిన న్యాయవాద వృత్తికే అంకితం కావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అలా ఆయన అన్ని ఆశలు వదిలేసుకున్న వేళ జగన్ నుంచి కబురు వచ్చిందని టాక్. ఆయన్ని రాజ్యసభకు పంపబోతున్నారని అంటున్నారు. ఈ మేరకు సూత్రప్రాయంగా ఒక హామీ అయితే దక్కిందట. కానీ మర్రికి మాత్రం ఎమ్మెల్సీ కావాలని ఉందిట. రాజ్యసభ మీద మోజు లేదని కూడా చెబుతున్నారు.

అసలు ఇంతకీ ఆయనకు రాజ్య సభ సీటు అయినా దక్కుతుందా చివరి నిముషంలో సమీకరణలు టోటల్ గా మారి అది కాస్తా జారుతుందా అన్న డౌట్లు అయితే క్యాడర్ లో ఉన్నాయట. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కావాలనుకుని వైసీపీలో ఫస్ట్ చేరి జగన్ తో అడుగులు వేసిన రాజశేఖర్ తరువాత ఎమ్మెల్సీ మంత్రి ఆశలతో అలా గడిపారు. ఇపుడు రాజ్యసభ అంటున్నారు. మొత్తానికి మర్రి దశ తిరుగుతుందా. లేక ఆయన ఎప్పటిలాగానే వన్ టైమ్ ఎమ్మెల్యేగానే మిగిలిపోతారా అంటే చూడాలి మరి.
Tags:    

Similar News