నరసింహన్‌ను తప్పించాలని మర్రి డిమాండ్‌

Update: 2015-07-04 11:41 GMT
రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ను తొలగించాలంటూ తెలుగుదేశం నేతలు డిమాండ్‌ చేయటం కామన్‌. కానీ.. ఈసారి అందుకు భిన్నమైన పార్టీ నుంచి ఈ డిమాండ్‌ రావటం విశేషం.

ఊహించని విధంగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి.. గవర్నర్‌ను తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గవర్నర్‌గా తన విధుల్ని సక్రమంగా నిర్వహించే విషయంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంటున్నారు.

టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై.. అధికారికంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రికార్డుల్లో ఉన్నప్పటికీ.. ఆయన్ను అధికారపార్టీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించటంలో గవర్నర్‌ తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేదని మండిపడ్డారు. విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అధికారపార్టీ మంత్రిగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని.. తన విధుల నిర్వహణతో విఫలమైన గవర్నర్‌ నరసింహన్‌ను తప్పించాలంటూ మర్రి డిమాండ్‌ చేస్తున్నారు.

కేవలం డిమాండ్‌ మాత్రంగానే కాకుండా.. కేంద్రానికి ఆయన ఈ మేరకు ఒక లేఖ రాయటం గమనార్హం. ఇంతకాలం తలసాని మీద ఎక్కుపెట్టిన మర్రి.. తాజాగా గవర్నర్‌వైపు గురి పెట్టటం సరికొత్త పరిణామంగా అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News