మక్కాలో క్రేన్ కూలి వందకు పైగా మృత్యువాత

Update: 2015-09-12 05:00 GMT
పవిత్ర స్థలంలో పెద్ద ఎత్తున ప్రాణాలు పోయాయి. జీవితకాలంలో ఒక్కసారైనా సరే అక్కడకు వెళ్లి వస్తే చాలు.. జీవితం ధన్యమవుతుందని భావించే అత్యంత పవిత్రస్థలం రక్తసిక్తమై.. బాధితుల హాహాకారాలతో దద్దరిల్లింది. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మక్కామసీదులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మసీదు ప్రాంతాన్ని విస్తరించే పనుల్లో భాగంగా భారీ క్రేన్ ను వినియోగిస్తున్నారు. అయితే.. క్రేన్ లోని పైభాగం కుప్పకూలి మసీదు ప్రాంతంలో పడిపోవటంతో భారీ నష్టం వాటిల్లింది.

ఈ ఘోర ప్రమాదంలో వందకు పైగా మృతి చెందగా.. మరో 184 మందికి తీవ్రగాయాలు అయ్యాయని చెబుతున్నారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది భారతీయులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. 2006లో చోటు చేసుకున్న తొక్కిసలాట కారణంగా వందలాది మంది యాత్రికులు మరణించారు. దీంతో.. మసీదు ప్రాంతాన్ని భారీగా విస్తరించాలని నిర్ణయించారు. నాలుగు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒకేసారి 22 లక్షల మంది యాత్రికులు ప్రార్థనలు చేసేలా భారీ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఇందులో భాగంగా భారీ క్రేన్ లను వినియోగిస్తున్నారు. తాజా ఘటనలో క్రేన్ పై భాగంగా కూలిపోవటంతో ఈ ఘోరం సంభవించింది. దుర్ఘటన కారణంగా వందలాది యాత్రికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గాయపడిన వారి ఆర్తనాదాలతో అక్కడి పరిసరాలు భీతావహ పరిస్థితి తలపిస్తున్నాయి. ఘటన జరిగన సమయంలో భారీగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ దుర్ఘటనకు సంబంధించి సహాయక చర్యలు అందించేందుకు అధికారులు పనులు వేగవంతం చేశారు. సౌదీ అరేబియా సివిల్ ఢిఫెన్స్ టీం డైరెక్టర్ జనరల్ సులేమాన్ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితి సమీక్షించి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Tags:    

Similar News