మాంచి జ‌గ‌న్ ఫోటోలు తీయండ్రా..?

Update: 2019-05-22 05:39 GMT
ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా తెలుగు మీడియాలో రాజ‌కీయ చీలిక కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌క మాన‌దు. ఎవ‌రి స్టాండ్ వారిద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం క‌నిపిస్తుంది. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డై.. తాము పూర్తిగా వ్య‌తిరేకించే నేత రాష్ట్ర ముఖ్య‌మంత్రి అవుతుంటే?  నిత్యం విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌తో పాటు.. తాము అచ్చేసే ఫోటోల్లోనూ కాస్తోకూస్తో నెగిటివిటిని వెతికి మ‌రీ పెట్టే ఫోటోలు.. ఎన్నిక‌ల్లో విజేత‌గా నిలిచిన టైంలో అచ్చేస్తే ప్ర‌జ‌లు ఊరుకోరుక‌దా?

ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియా సంస్థ‌ల‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింద‌ట‌. ఈ సంస్థ‌ల్లో జ‌గ‌న్ లైఫ్ సైజ్ ఫోటోలు పెద్ద‌గా లేవ‌ని చెబుతున్నారు. దీంతో.. ప్ర‌తి ఒక్క మీడియా హౌస్ లోనూ జ‌గ‌న్ లైఫ్ సైజ్ ఫోటోల‌కు డిమాండ్ పెరిగింది. ఫోటో లైబ్ర‌రీలో భూత‌ద్దాలు వేసి మ‌రీ.. జ‌గ‌న్ రీసెంట్ లైఫ్ సైజ్ ఫోటోలు ప‌ట్టుకురావాల‌న్న పుర‌మాయింపులు పెరిగిన‌ట్లుగా తెలుస్తోంది.

ఏపీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ భారీ ఘ‌న‌విజ‌యం ఖాయ‌మ‌న్న అభిప్రాయానికి వ్య‌తిరేక మీడియాలోనూ వినిపిస్తోందని.. ఒక‌వేళ తమ అంచ‌నాల‌కు భిన్నంగా జ‌గ‌న్ గెలిస్తే.. త‌ప్ప‌నిస‌రిగా భారీఎత్తున జ‌గ‌న్ ఫోటోను అచ్చేయాల్సి వ‌స్తోంది. త‌మ‌ది జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియా కావ‌టంతో ఆయ‌న ఫోటోలు పెద్ద‌గా ఉండే ప‌రిస్థితి ఉండ‌దు. ఉన్నా.. అవేమీ భారీగా ఉండ‌వ‌ని.. ఒక మోస్త‌రు ఫోటోలు మాత్ర‌మే ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మాంచి లైఫ్ సైజ్ జ‌గ‌న్ ఫోటోల్ని వెతికి పెట్టండ్రా బాబు అంటూ అడ‌గ‌టం ఎక్కువైంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. స‌ద‌రు మీడియా సంస్థ‌ల ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఇప్పుడీ ప‌రిస్థితి క‌త్తి మీద సాములా మారిన‌ట్లుగా చెబుతున్నారు. జ‌గ‌న్ ఫోటోలు అంత అర్జెంట్ గా.. ఎక్క‌డి నుంచి తీసుకురావాల‌న్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. అవ‌న్నీ రీసెంట్ గా ఉండాల‌న్న కండిష‌న్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. జ‌గ‌న్ గెలుపు వేళ‌.. జ‌గ‌న్ బ్యాచే..భారీ ఎత్తున ఫోటోల్ని త‌మ వ్య‌తిరేక మీడియాకు సైతం ఇవ్వాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. మొత్తానికి జ‌గ‌న్ లైఫ్ సైజు ఫోటోలు ఆయ‌న్ను వ్య‌తిరేకించే మీడియాలోనూ భారీగా అచ్చేసే టైం వ‌చ్చేసిన‌ట్లేన‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News