ఆ ప్ర‌ముఖుడి అరెస్ట్ ఏ మీడియాలోనూ రాలేదేం?

Update: 2019-05-17 08:42 GMT
ఒక ప్ర‌ముఖుడు. అలాంటి ఇలాంటి కాదు.. త‌ర‌చూ మీడియా హౌసులన్ని ఆయ‌న‌తో మాట్లాడుతుంటాయి. అలాంటి ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. అది కూడా గృహ‌హింస చ‌ట్టం కింది. అందునా ఆయ‌న మీద ఫిర్యాదు చేసింది ఆయ‌న రెండో భార్య‌. త‌న‌ను మోసం చేసి పెళ్లి చేసుకున్నార‌ని.. మొద‌ట జ‌రిగిన పెళ్లిని దాచి పెట్టి చేసుకోవ‌ట‌మే కాదు.. మోసం చేశార‌న్న‌ది ఆమె ఆరోప‌ణ‌. అంత పెద్దాయ‌న మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తారు క‌దా. అదే రీతిలో ఈ ప్ర‌ముఖుడి విష‌యంలోనూ జ‌రిగింది.

కానీ.. ఫిర్యాదు బ‌లంగా ఉండ‌టం.. ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని చెప్పే ఆధారాలు ల‌భించ‌టంతో పోలీసులు మొహ‌మాట ప‌డ‌లేదు. ఆ ప్ర‌ముఖుడ్ని అరెస్ట్ చేశారు. రిమాండ్ కు కూడా త‌ర‌లించారు. ఇంత‌కు మించిన వార్త ఇంకేం ఉంటుంది. మామూలుగా అయితే.. యావ‌త్ మీడియా మొత్తం హ‌డావుడి చేసేది. బ్రేకింగ్ న్యూసులు వేసేవారు. ప్ర‌త్యేక చ‌ర్చ‌లు పెట్టేవారు. ఓబీ వ్యాన్లు పెట్టి.. స‌ద‌రు ప్ర‌ముఖుడి రిమాండ్ త‌ర‌లింపును లైవ్ లో చూపించే ప్ర‌య‌త్నం చేసేవారు.

కానీ.. అదేం జ‌ర‌గ‌లేదు స‌రి క‌దా.. ప్రింట్ మీడియాలో క‌నీసం సింగిల్ కాల‌మ్ వార్త కూడా రాని ప‌రిస్థితి. ఆ మాట‌కు వ‌స్తే.. ప్రింట్.. ఎల‌క్ట్రానిక్ స‌హా ఏ మీడియాలోనూ ఆ వార్త క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఎందుకిలా?

ఆయ‌నంత ప్ర‌ముఖుడా? ఎంత ప‌వ‌ర్ ఫుల్ కాకుంటే.. ఇవాల్టి రోజున జ‌రిగిన విష‌యాన్ని చూపించేందుకు మీడియా తెగ మొహ‌మాట ప‌డిపోతోంద‌న్న డౌట్ వ‌చ్చిందా?  నిజ‌మే.. ఆయ‌న ముఖ్య‌మంత్రికాదు. ఆ మాట‌కు వ‌స్తే.. రాజ‌కీయాల‌తో పెద్ద‌గా సంబంధాలు లేవు. అలా అని మీడియా ఓన‌ర్ అంత‌క‌న్నా కాదు. కాకుంటే.. స‌మ‌స్త మీడియాల వార్త‌ల్ని అందించే కేబుల్ రంగ ప్ర‌ముఖుడంతే. అలాంటి ఆయ‌న వార్త‌ను చూపించేందుకు మీడియా తెగ మొహ‌మాట ప‌డిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేబుల్ క‌నెక్ష‌న్లు భారీగా ఉన్న పెద్ద‌మ‌నిషి మీద‌.. పోలీసులు కేసు న‌మోదు చేసి.. అరెస్ట్ చేసినా ఎవ‌రు ప‌ట్టించుకోలేదు. స‌ద‌రు ప్ర‌ముఖుడికి కోపం వ‌స్తే.. ఆయ‌న కేబుల్ వ్య‌వ‌స్థ‌లో స‌ద‌రు ఛాన‌ల్ ఎక్క‌డికో వెళ్లిపోవ‌ట‌మో లేదంటే క‌నిపించ‌కుండా పోయే ఛాన్స్ ఉంద‌న్న ముంద‌స్తు జాగ్ర‌త్త‌తో ఆయ‌న అరెస్ట్ ను క‌వ‌ర్ చేయ‌కుండా ఉండిపోయారు. ఇవాల్టి రోజున కూడా మీడియాను శాసించేటోళ్లు ఉన్నార‌న‌టానికి తాజా ఉదంతం చిన్న ఎగ్జాంఫుల్ మాత్ర‌మే సుమా!


Tags:    

Similar News