తాజా రిజ‌ల్ట్ మెగా ఫ్యామిలీకి భారీ దెబ్బే!

Update: 2019-05-24 04:54 GMT
బోలెడంత ఇమేజ్. కాలు బ‌య‌ట పెడితే చూసేందుకు ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ రోడ్ల మీద‌కు వ‌చ్చేసి నీరాజ‌నాలు ప‌ట్ట‌టం మెగా ఫ్యామిలీకి కొత్తేం కాదు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ.. సినిమాల్ని వ‌దిలి రాజ‌కీయాల్లోకి వ‌స్తే మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితుల్ని ఎదుర్కొవ‌టం కొత్తేం కాదు. వెండితెర వేల్పులుగా వెలిగిపోయే మెగా బ్ర‌ద‌ర్స్ కు రాజ‌కీయాలు ఎందుకో అచ్చిరావు.

ఇదే విష‌యం తాజా ఎన్నిక‌లు మ‌రోసారి స్ప‌ష్టం చేశాయ‌ని చెప్పాలి. తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్ త‌ర్వాత భారీ సంఖ్య‌లో అభిమానుల్ని సంపాదించుకున్న అగ్ర హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. సున్నిత‌మైన మ‌న‌సు.. ఎవ‌రిని నొప్పించ‌ని త‌త్త్వం ఉన్న చిరు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్నార‌న్నంత‌నే భారీ అంచ‌నాలు వెల్లువెత్తాయి. అయితే.. సినీ గ్లామ‌ర్ ఒక్క‌టే రాజ‌కీయాల‌కు స‌రిపోవ‌ని.. అంత‌కు మించిన పొలిటిక‌ల్ గ్రామ‌ర్ అవ‌స‌ర‌మ‌న్న విష‌యాన్ని చిరు త‌క్కువ కాలంలోనే గ్ర‌హించారు.

ఎన్నిక‌ల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ఆయ‌న్ను గోదావ‌రి వాసులు తిర‌స్క‌రిస్తే.. తిరుప‌తి వాసులు అక్కున చేర్చుకోవ‌టంతో భారీ అవ‌మానం తృటిలో త‌ప్పిన‌ట్లైంది. అదే స‌మ‌యంలో ఆయ‌న బావ‌మ‌రిదిని ఎంపీగా బ‌రిలోకి దించితే మొహ‌మాటం లేకుండా రిజెక్ట్ చేసిన వైనం తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగానే గుర్తుండే ఉంటుంది. క‌ట్ చేస్తే.. ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో క‌లిపేస్తూ మెగాస్టార్ తీసుకున్న నిర్ణ‌యం తెలుగు ప్ర‌జ‌ల్ని ఎంత‌గా హ‌ర్ట్ చేసిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

అన్న పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో క‌లిపేసిన త‌ర్వాత కొంత‌కాలం కామ్ గా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. విభ‌జ‌న నేప‌థ్యంలో జ‌న‌సేన పేరుతో పెట్టిన పార్టీ మెగా అభిమానుల్లో కొత్త జోష్ కు కార‌ణ‌మైంది. టీడీపీ.. బీజేపీ మిత్ర‌ప‌క్షంగా.. ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌కుండా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ప‌వ‌న్.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. 2014లో టీడీపీ ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క‌భూమిక పోషించారు.

రాజ‌కీయం అంటే చాలా సింఫుల్ అనుకున్న ప‌వ‌న్ కు తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు దిమ్మ తిరిగే షాకిచ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 2014లో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌న్న ప‌వ‌న్.. త‌న మాట‌ల‌కు భిన్న‌మైన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం తెలుగు ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌లేద‌నే చెప్పాలి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందు సీరియ‌స్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న ప్ర‌జ‌ల్ని ఏ మాత్రం ప్ర‌భావితం చేయ‌లేక‌పోయార‌న్న విష‌యం తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూస్తే అర్థం కాక మాన‌దు.

ప‌వ‌న్ స్వ‌యంగా బ‌రిలోకి దిగిన రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆయ‌న్ను రిజెక్ట్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. భీమ‌వ‌రంలో గెలుపు అంత వీజీ కాకున్నా.. గాజువాక‌లో ఆయ‌న గెలుపు ప‌క్కా అన్న మాట మొద‌ట్నించి వినిపించిందే. ఇక‌.. ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు ఎంపీగా బ‌రిలోకి దిగినా.. ఆయ‌న ప్ర‌భావం అస‌లేమీ లేకుండా పోవ‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల వేళ వ‌చ్చిపోయే వారికి త‌మ ఓట్లు వేయ‌మ‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పిన వైనం నాగ‌బాబు ఎపిసోడ్ లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌క‌మాన‌దు. అంతేకాదు.. తాజా ఫ‌లితాలు మెగా ఫ్యామిలీకి ఎన్నిక‌లు అచ్చిరావ‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశాయ‌ని చెప్పాలి. సినీ న‌టులుగా అభిమానిస్తాం కానీ.. రాజ‌కీయంగా అక్కున చేర్చుకోలేమ‌న్న సందేశాన్ని ఏపీ ప్ర‌జ‌లు మెగా ఫ్యామిలీకి త‌న తీర్పుతో చెప్పేశారా? అన్న భావ‌న క‌లిగేలా తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉన్నాయ‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News