శ్రీకాకుళం జిల్లాలో క‌ల‌క‌లం రేపుతున్న అనుమానితులు

Update: 2020-04-20 10:32 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని ఉత్త‌రాంధ్ర ప్రాంతంలోని విజ‌య‌న‌గ‌రం - శ్రీకాకుళం జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు కరోనా వైర‌స్ వ్యాపించ‌లేదు. పూర్తి గ్రామీణ జిల్లాలుగా ఉన్న ఆ ప్రాంతాల్లో క‌రోనా సోక‌క‌ పోవ‌డం హ‌ర్షించే విష‌యం. దీంతో ఆ రెండు జిల్లాలు ప్ర‌శాంతంగా ఉన్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఉన్న అనుమానితులు క‌ల‌క‌లం రేపుతున్నారు. వారికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండి ఆస్ప‌త్రుల్లో చేరారు. వారి ఆరోగ్య ప‌రిస్థితి - వారు తిరిగిన ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తే వారికి క‌రోనా సోకి ఉంటుంద‌ని వైద్యుల‌తో పాటు అధికార యంత్రాంగం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ జిల్లాలో తొలి సారిగా క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.

గుంటూరులోని మిర్చి యార్డ్‌ లో కూలీగా పని చేసే వ్య‌క్తి లాక్‌ డౌన్‌ తో గుంటూరులో చిక్కుకుపోయాడు. ఈ క్ర‌మంలో శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొఠారిపురం గ్రామానికి ఎలాగైనా చేరుకోవాల‌ని భావించి ప‌య‌న‌మ‌య్యాడు. అందులో భాగంగా కొంత దూరం లారీల్లో - మరికొంత దూరం ఇత‌రుల‌ను లిఫ్ట్ అడిగి - ఇంకొంత దూరం నడిచి అష్ట‌క‌ష్టాలు ప‌డి స్వ‌గ్రామం కొఠారిపురం చేరుకున్నాడు. అయితే అప్పటికే అతడు తీవ్రమైన జ్వరం - దగ్గుతో బాధ‌ప‌డుతున్నాడు. పైగా రెడ్‌జోన్‌గా ఉన్న గుంటూరు నుంచి వ‌చ్చాడు. అయితే స్వ‌గ్రామానికి చేరుకున్న అత‌డికి చుక్కెదురైంది. గ్రామ‌స్తులు అత‌డిని గ్రామంలోకి అనుమ‌తించ‌ లేదు. అతడి ఆరోగ్యం బాగాలేక‌ పోవ‌డంతో రాజాంలోని ప్రభుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం శ్రీకాకుళంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రికి త‌ర‌లించి ఐసొలేషన్ వార్డులో ఉంచారు. అత‌డి న‌మూనాలు సేక‌రించి ల్యాబ్‌ కు పంపించారు. అతడికి కచ్చితంగా క‌రోనా పాజిటివ్  వచ్చి ఉంటుంని వైద్యారోగ్య శాఖ అధికారులు భ‌యాందోళన వ్య‌క్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఇద్దవానిపాలెం గ్రామానికి చెందిన కొంద‌రు సముద్ర మార్గం ద్వారా చెన్నై నుంచి చేరుకున్నారు. ఈ ప్రాంతానికి చెందిన కొంత‌మంది మ‌త్య్స‌కారులు ఉపాధి కోసం చెన్నై వెళ్లారు. లాక్‌ డౌన్ కారణంగా చెన్నైలో చిక్కుకు పోవడంతో సముద్ర మార్గం ద్వారా శ్రీకాకుళం రావాలని భావించారు. అందులో భాగంగా  ఓ బోటుపై సముద్రమార్గంలో వెయ్యి  కిలోమీటర్లు ప్రయాణించారు. ఇద్ద‌వాని పాలెం వారు చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారంద‌రినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారి నుంచి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌ కు పంపించారు. వారిలో చాలామంది జ్వరం - దగ్గుతో బాధపడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

వీరి వ‌ల‌న శ్రీకాకుళం జిల్లాలో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వారికి క‌రోనా పాజిటివ్ వ‌స్తే శ్రీకాకుళం జిల్లాలో భారీగా క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టి నుంచే క‌రోనా క‌ట్ట‌డికి ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.



Tags:    

Similar News