ప్రాణాంతక క్రీడ బ్లూవేల్ చాలెంజ్ గేమ్ పిల్లల్ని - టీనేజర్లను ఎలా లోబర్చుకుని హతమారుస్తుందో తెలసుకునేందుకు మనదేశంలో ఎన్నో ఉదాహరణలు బయటపడిన సంగతి తెలిసిందే. పసి మనసుల్ని ఎంత మానసిక దౌర్బల్యానికి గురిచేస్తుందో తెలియజేసే ఈ ఘటన రాజస్థాన్ లోని జోధ్ పూర్ పట్టణంలో జరిగిన తీరు అందర్నీ కలిసివేసింది. ``ఆట పూర్తిచేయకపోతే అమ్మ చచ్చిపోతుంది`` అంటూ ఓ బీఎస్ ఎఫ్ జవాన్ కుమార్తె అయిన 17 ఏళ్ల బాలిక చెప్పిన మాటలు విని వారంతా విస్తుపోయారు. ఈ వార్త కలకలం రేపడం - బ్లూవేల్ ఛాలెంజ్ వీడియో గేమ్ కు విద్యార్థులు బలవుతున్న నేపథ్యంలో కేంద్ర స్త్రీ - శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ రంగంలోకి దిగారు.
దేశంలోని అన్ని స్కూళ్ల ప్రిన్సిపాల్స్ కు కేంద్ర స్త్రీ - శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ లేఖ రాశారు. బ్లూవేల్ గేమ్ పట్ల టీచర్లు - విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని లేఖలో సూచించారు. ``బ్లూవేల్ గేమ్ ఆడుతూ ఇప్పటికే అనేక మంది పిల్లలు బలవన్మరణానికి పాల్పడ్డారు. బ్లూవేల్ కు బాధితులుగా మారుతున్న విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే`` అని మంత్రి అన్నారు. గేమ్ ను డౌన్ లోడ్ చేయకుండా ఉండేందుకు వీలైన చర్యలు తీసుకోవాలని టెక్నాలజీ మంత్రిత్వశాఖను కోరినట్లు మేనకాగాంధీ తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనపై టీచర్లు నిఘా పెట్టాలని, ఏదైనా అనుమానం కలిగితే, హెల్ప్ లైన్ నెంబర్ 1098కు ఫోన్ చేయాలని ఆమె కోరారు.
మరోవైపు చిన్నారులను బలిగొంటున్న బ్లూవేల్ గేమ్ ను నిషేధించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. ఈ గేమ్ నిషేధానికి అవసరమైన చర్యలు చేపట్టాలని హోంశాఖకు - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. బ్లూవేల్ ఆట కారణంగా చిన్నారులు - యువత ఆత్మహత్యకు పాల్పడుతుండటం ఆందోళనకరమని, ఇలాంటి మృత్యుక్రీడలకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని అహ్మదాబాద్ లో మీడియాకు తెలిపారు. ఈ గేమ్‌ను నిషేధించేందుకు అవసరమైతే రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకువస్తుందన్నారు. ఇదే సమయంలో మరోవైపు బ్లూవేల్ గేమ్ పై విద్యార్థులు - తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. ప్రజల సమాచారార్థం కొన్ని సూచనలను జారీ చేసింది. ఎవరైనా బ్లూవేల్ చాలెంజ్ గేమ్ బారిన పడినట్లు తెలిస్తే, అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికల్ని గమనించాలని సూచించింది. ఇక కశ్మీర్ ప్రభుత్వం కూడా బ్లూవేల్ చాలెంజ్ గేమ్ పై చైతన్యపరిచేందుకు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. జమ్మూ డివిజన్ లోని ముఖ్యవిద్యాధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పాఠశాల విద్య డైరెక్టర్ రవీందర్ సింగ్ వెల్లడించారు.