ఐటీ జీవుల‌కు మెట్రో క్రిస్మ‌స్ కానుక‌!

Update: 2018-09-26 04:59 GMT
అవును.. మ‌హా అంటే మ‌రో మూడు నెల‌లు ఓపిక ప‌డితే చాలు.. హైద‌రాబాద్ ఐటీ ఉద్యోగుల జీవితాలు మ‌రింత హ్యాపీగా మారిపోవ‌టం ఖాయం. హైద‌రాబాద్ అన్నంత‌నే ఐటీ ఎంత‌లా గుర్తుకు వ‌స్తుందో.. ట్రాఫిక్ ఇక్క‌ట్లు కూడా అంతేలా గుర్తుకు వ‌స్తుంటాయి. మాదాపూర్.. హైటెక్ సిటీ.. గ‌చ్చిబౌలి త‌దిత‌ర ప్రాంతాల్లో ఉండే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగులు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉన్నారు.

మాదాపూర్ నుంచి త‌క్కువ‌లో త‌క్కువ రెండు మూడు కిలోమీట‌ర్లు మొద‌లుకొని 30 కిలోమీట‌ర్ల పైనే నలువైపులా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ఉద్యోగం కోసం నిత్యం ఆఫీసుల‌కు రావ‌టానికి త‌క్కువ‌లో త‌క్కువ రెండు నుంచి నాలుగు గంట‌ల స‌మ‌యాన్ని వెచ్చించాల్సిన ప‌రిస్థితి.

సొంతంగా వాహ‌నం ఉన్న వారు అయితే రెండు నుంచి మూడు గంట‌లు.. ప్ర‌జా ర‌వాణాను న‌మ్ముకున్న వారైతే మ‌రో గంట‌.. అదేమీ లేకుండా క్యాబ్ ల్లో వ‌చ్చే వారైతే రెండు గంట‌ల్లో ఆఫీసుల‌కు చేరుకునే ప‌రిస్థితి. అయితే.. ఈ ట్రాఫిక్ క‌ష్టాల్ని తీర్చేందుకు ఉన్న ఏకైక మార్గం మెట్రో రైలు. హైటెక్ సిటీ ప్రాంతానికి ఈ మెట్రో రైలు ఈ క్రిస్మ‌స్ నాటికి న‌గ‌ర‌జీవుల‌కు అందుబాటులోకి రానుంది.

ఇటీవ‌ల ప్రారంభ‌మైన ఎల్ బీన‌గ‌ర్ కారిడార్ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మాట్లాడుతూ.. డిసెంబ‌రు మూడో వారంలోపు హైటెక్ సిటీకి మెట్రో రైలు ప‌రుగులు తీయాల‌న్న ల‌క్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో.. గ‌వ‌ర్న‌ర్ మాట‌కు ప్రాధాన్య‌త ఇస్తూ.. ప‌నులు పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంది. సాంకేతికంగా కొన్ని స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ.. గ‌వ‌ర్న‌ర్ నోటి నుంచి మాట రావ‌టం.. దాన్నిస‌వాల్ గా తీసుకునేందుకు హైద‌రాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ సంస్థ‌లు వ‌ర్క్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఒక‌వేళ గ‌వ‌ర్న‌ర్ నోటి మాట నిజమై.. హైటెక్ సిటీకి మెట్రో కానీ అందుబాటులోకి వ‌స్తే.. ఎల్ బీ న‌గ‌ర్ నుంచి నాగోల్ నుంచి.. మియాపూర్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు చెందిన ఐటీ ఉద్యోగుల జీవితాలకు ట్రాఫిక్ క‌ష్టాల నుంచి ఎంతోకొంత ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సో.. ఈ క్రిస్మ‌స్ హైద‌రాబాద్ ఐటీ ఉద్యోగుల‌కు స్వీట్ న్యూస్ తెస్తుంద‌ని ఆశిద్దాం.
Tags:    

Similar News