పండుగ సీజన్లో ఇరగదీసి.. అందరికి అసూయ పుట్టించింది

Update: 2019-10-31 04:14 GMT
ఏడాదంతా ఒక ఎత్తు అయితే దసరా సీజన్ మార్కెట్లోని ప్రతి కంపెనీకి కీలకం. ఇక.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని విక్రయించే సంస్థలకు అత్యంత ముఖ్యమైంది దసరా అమ్మకాలు.  దసరా నుంచి దీపావళి వరకూ సాగే నెల వ్యవధిలో షాపింగ్ భారీగా ఉంటుంది. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతి కంపెనీ ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే.. మొబైల్.. టీవీ మార్కెట్లో చైనాకు చెందిన షావోమి (ఎంఐ) కంపెనీ ఇరగదీసినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు ఉండే ఫోన్లను అమ్మే సంస్థగా పేరున్న ఎంఐ.. ఈ దసరా సీజన్ లో ఇరగదీయటమే కాదు.. పోటీ కంపెనీలకు తన అమ్మకాలతో అసూయ పుట్టించింది. ఇప్పటివరకూ ఎవరూ సాధించలేని రికార్డును తన పేరుతో సొంతం చేసుకుంది. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 29 మధ్యన కీలకమైన పండుగ సీజన్లో ఈ కంపెనీ ఏకంగా 1.20 కోట్ల ఉత్పత్తుల్ని అమ్మకాలు జరిపి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఈ ఏడాది తమ లక్ష్యాలకు మించిన అమ్మకాల్ని తాము సాధించినట్లుగా కంపెనీ చెబుతోంది. గత ఏడాది ఇదే సీజన్లో 85లక్షల ఉత్పత్తులే అమ్మకాలు జరపగా.. ఈ ఏడాది అందుకు భిన్నంగా 1.2కోట్ల ఉత్పత్తుల్ని అమ్మినట్లుగా చెబుతోంది. దేశీయ మార్కెట్లో ఏ కంపెనీ సాధించలేని తిరుగులేని రికార్డును తాము సొంతం చేసుకున్నామని షావోమీ చెబుతోంది.

తాను అమ్మకాలు జరిపిన 1.2 కోట్ల ఉత్పత్తుల్లో సింహభాగం మొబైల్ ఫోన్లదే. నెల వ్యవధిలో 85లక్షల స్మార్టు ఫోన్లు.. ఆరు లక్షల ఎం.ఐ టీవీలు.. 30 లక్షలు యాక్ససరీస్ లు అమ్మినట్లు సంస్థ వెల్లడించింది. తాను అమ్మిన ఫోన్లలో రెడ్ మీ నోట 7 సిరీస్ మోడల్ ను అత్యధికంగా అమ్మకాలు జరిపినట్లు కంపెనీ చెప్పింది. షావోమీ పోటీ సంస్థలేమీ అమ్మకాల్లో ఇంత భారీగా లేవన్న మాట మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. పండుగ నెలలో 53లక్షల ఉత్పత్తుల్ని అమ్మితే చాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంటే అందుకు భిన్నంగా 40 శాతం ఎక్కువగా అమ్మటం గమనార్హం. ఈ కంపెనీ సాధించిన గణాంకాలు మిగిలిన కంపెనీలకు ఏ మాత్రం మింగుడుపడటం లేదంటున్నారు.


Tags:    

Similar News