పీవీపీ ప్రాపర్టీ ఇష్యూ... ఎమ్మెల్యే హల్ చల్

Update: 2017-07-03 13:59 GMT
హైద‌రాబాద్‌ లోని కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3 లో హడావుడి చేశారు. పబ్లిక్ రోడ్ కు అడ్డంగా నిర్మించిన ఓ గోడను కూల్చేందుకు వచ్చిన అధికారులను ఆయన, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమైంది.
    
బంజారాహిల్స్ రోడ్ నెంబర్‌ 3 లో ఓ లేఅవుట్ లో కొన్ని గ్రూప్ హౌస్ లు ఉన్నాయి. అందులో పీవీపీ అధినేత పొట్లూరి వరప్రసాద్ కు కూడా స్థలం ఉంది. ఆ స్థలానికి వెళ్లే దారి ప్రభుత్వ దారి.. కానీ, దాన్ని కొందరు ప్రయివేటు మార్గంగా పేర్కొంటూ అక్రమంగా గోడ నిర్మించారు. దీంతో పొట్లూరి స్థలానికి దారి లేకుండా అయింది. అక్కడ ఇల్లు నిర్మించుకోవాలనుకున్న పొట్లూరి దారి క్లియర్ చేయాలంటూ జీహెచ్ ఎంసీకి దరఖాస్తు చేయడంతో వారు ఆ గోడ అక్రమ నిర్మాణమని గుర్తించి తొలగించడానికి వచ్చారు. 300 మీటర్ల మేర ఉన్న ఆ గోడను కూల్చి వేస్తుండగా   ఎంఐఎం నేత - కార్వాన్ ఎమ్మెల్యే కౌస‌ర్ అక్క‌డ‌కు చేరుకున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను బెదిరించడానికి ప్ర‌య‌త్నించారు. జీహెచ్‌ ఎంసి అధికారులను అడ్డుకున్నారు.  ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను అసభ్య పదజాలంతో తిట్టారు. తన మనుషులను పంపించి జిహెచ్‌ ఎంసి అధికారులను బెదిరించి అక్కడినుంచి పంపించివేశారు.
    
కాగా, ఈ గోడను అక్రమంగా నిర్మించారని అది పబ్లిక్ రోడ్ అని రికార్డుల్లో స్పష్టంగా ఉందని.. తాను దరఖాస్తు చేసిన తరువాత కూడా అధికారులు అన్నీ పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నారని పీవీపీ అంటున్నారు. అంతేకాదు.. గోడ కూల్చడానికి రావడానికి ముందే నెల రోజుల కిందట నోటీసులు కూడా ఇచ్చారని అయన అంటున్నారు. అన్నీ రికార్డుల్లో ఉన్నాయని.. అక్రమంగా నిర్మించిన గోడను తొలగించడానికి వచ్చిన సిబ్బందిపై కార్వాన్ ఎమ్మెల్యే దాడి చేయడం సరికాదని పొట్లూరి అన్నారు.
    
కాగా ప్రజా సమస్యలను పట్టించుకోని నేతలు ఇలా ప్రయివేటు వివాదాల్లో మాత్రం అధికారులపై ఒత్తిడి చేయడం.. తమ అధికారం చూపించాలనుకోవడం ఎక్కువవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News