ఓవైసీ రాజ్య విస్త‌ర‌ణ కాంక్ష‌..మ‌రో రాష్ట్రంలో పోటీ

Update: 2019-11-03 05:04 GMT
గ‌తంలో రాజుల‌కు అధికారం - రాజ్య‌విస్త‌ర‌ణ కాంక్ష ఉన్న‌ట్లే... ఇప్పుడు రాజ‌కీయ పార్టీల‌కు సైతం అలాంటి కోరికే పుడుతోంది. అవ‌కావాన్ని అందిపుచ్చుకొని...ఒక ప్రాంతం/రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రంలోకి విస్త‌రించేందుకు...నేత‌లు ఎత్తులు వేస్తున్నారు.  హైదరాబాద్‌ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మజ్ల్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్ల్లిమీన్‌ (మజ్లీస్) పార్టీ ఇదే ఒర‌వ‌డిలో చేరింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో - బీహార్‌ లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంఐఎం తన ఉనికిని చాటుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో రెండు శాసనసభ స్థానాలతో పాటు బీహార్‌ లోని కిషన్‌ గంజ్‌ స్థానంలోనూ మజ్లీస్  గెలుపొందింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌ లోనూ తమ పార్టీని విస్తరించాలన్న యోచనలో ఆ పార్టీ ఉంది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నాయ‌క‌త్వంలోని ఎంఐఎం నిర్ణయించింది. ముస్లింల ప్రాబల్యం ఉన్న 10 నుంచి 12 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాలని భావిస్తోంది. ఆ రాష్ట్రంలో 14 శాతం మేర ముస్లిం జనాభా ఉంది. దీంతో ముస్లింలు మెజార్టీ ఉన్న‌చోట్ల త‌మ ముస్లిం నేత‌ల‌ను బ‌రిలో దించాల‌ని ఎంఐఎం ఆలోచిస్తోంది. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 20 వరకు మొత్తం ఐదు విడుతల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తొలి విడుతలో 13 స్థానాలకు నవంబర్‌ 30న - రెండో విడుతలో 20 నియోజకవర్గాలకు డిసెంబర్‌ 7న - మూడో విడుతలో 17 స్థానాలకు డిసెంబర్‌ 12న - నాలుగో విడుతలో 15 స్థానాలకు డిసెంబర్‌ 16న - చివరి విడుతలో 16 నియోజకవర్గాలకు డిసెంబర్‌ 20న పోలింగ్‌ జరుగనుంది. డిసెంబర్‌ 23న ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపింది.

కాగా, బీహార్‌ లోని కిషన్‌ గంజ్‌ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎంఐఎం గెలువడం రాష్ర్టానికే ప్రమాదకరమని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు మహ్మద్‌ అలీ జిన్నా సిద్ధాంతాన్ని ఎంఐఎం పాటిస్తుంటుందని, అలాంటి పార్టీ కిషన్‌ గంజ్‌ లో గెలువడం బీహార్‌కే ప్రమాదకరమని పేర్కొన్నారు. కిషన్‌ గంజ్‌ లో జిన్నా సిద్ధాంతాలను పాటించే వాళ్లు - జాతీయగీతం వందేమాతరాన్ని వ్యతిరేకించేవాళ్లు గెలిచారని - వీరితో బీహార్‌ లోని సామరస్య వాతావరణం దెబ్బతినే ప్రమాదమున్నదని పేర్కొన్నారు.


Tags:    

Similar News