ఈమె గెలిస్తే... ఒక్క‌రినీ వ‌దిలిపెట్ట‌ర‌ట‌!

Update: 2018-12-31 08:35 GMT
రాయ‌ల‌సీమ రాజ‌కీయాల్లో భూమా కుటుంబానికి మంచి గుర్తింపే ఉంది. భూమా నాగిరెడ్డితో పాటు ఆయ‌న స‌తీమ‌ణి హోదాలో భూమా శోభానాగిరెడ్డి కూడా రాజ‌కీయాల్లో బాగానే రాణించారు. ఒకానొక ద‌శ‌లో నాగిరెడ్డి కంటే కూడా శోభాకే రాజ‌కీయ పార్టీలు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వైనం కూడా మ‌రిచిపోలేనిదే. శోభా నాగిరెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాతే... భూమా ఫ్యామిలీపై ఉన్న ఫ్యాక్ష‌న్ ముద్ర చెరిగిపోవడం ప్రారంభం కాగా... ఆమె రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన త‌ర్వాత మ‌ళ్లీ అవే వాస‌న‌లు ఆ కుటుంబానికి అంటుకున్నాయి. టీడీపీతోనే రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన భూమా ఫ్యామిలీ ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్ర‌జారాజ్యంలోకి వెళ్లింది. ఈ మార్పున‌కు చంద్ర‌బాబు అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు ఓ కార‌ణ‌మైతే... బాబు వ‌ద్ద త‌మ‌కు ఎదుర‌వుతున్న అవ‌మానాల‌ను ఇక భ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని - పార్టీ మారక త‌ప్ప‌ద‌ని భూమా ఫ్యామిలీ తీసుకున్న నిర్ణ‌యంలోనూ శోభాదే కీల‌క భూమిక‌గా చెప్పాలి.

ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి వైసీపీలోకి చేరిన భూమా ఫ్యామిలీ... శోభా బ‌తికున్నంత కాలం కూడా పార్టీలో కీల‌క భూమిక పోషించింది. వైసీపీలో భూమా నాగిరెడ్డి కంటే కూడా శోభాకే అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... క‌ర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీకి ఏకంగా రెండు అసెంబ్లీ టికెట్లిచ్చారు. అయితే ఎన్నిక‌ల పోలింగ్ కంటే ముందుగానే శోభా రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోవ‌డం భూమా ఫ్యామిలీతో పాటు వైసీపీకి కూడా తీర‌ని లోటునే మిగిల్చింది. త‌ల్లి మ‌ర‌ణంతో త‌ప్ప‌నిస‌రిగా రాజ‌కీయాల్లోకి రావాల్సిన ప‌రిస్థితుల్లో తండ్రి నాగిరెడ్డి అండ‌తో రంగంలోకి దిగిన భూమా అఖిల‌ప్రియ ఆళ్ల‌గ‌డ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత గుండెపోటుతో నాగిరెడ్డి కూడా చ‌నిపోవ‌డంతో అఖిల‌కు అతి చిన్న వ‌య‌సులోనే మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. మంత్రి ప‌ద‌వి ద‌క్కేదాకా కాస్తంత సైలెంట్‌ గానే ఉండిపోయిన అఖిల‌... ఆ త‌ర్వాత త‌న ప్రాభ‌ల్యం పెంచుకునే య‌త్నం మొద‌లెట్టార‌ని చెప్పాలి. త‌న తండ్రికి కుడిభుజంలా వ్య‌వ‌హ‌రించిన ఏవీ సుబ్బారెడ్డిని కూడా ప‌క్క‌న‌పెట్టేసిన అఖిల‌... ఇప్పుడు త‌న తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగించేందుకు ఏకంగా ఫ్యాక్ష‌న్ త‌రహా డైలాగుల‌ను ప‌లుకుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అఖిల నుంచి కాస్తంత గట్టి హెచ్చ‌రిక‌ల్లాంటి వ్యాఖ్య‌లు బ‌య‌ట‌కు రావ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు తెర తీసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను గెలిచిన త‌ర్వాత‌... త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వారిలో ఏ ఒక్క‌రిని కూడా వ‌దిలిపెట్టేది లేద‌ని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న సొంతూరు ఆళ్లగడ్డలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనను ఓడించేందుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయని మండిపడ్డారు. తనను ఓడించేందుకు బాగా కష్టపడాలని ప్రత్యర్థులకు సూచించారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే... ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నంద్యాలలో గెలవలేని నేతలు కూడా తనను ఓడించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఆళ్లగడ్డ - నంద్యాలలో భూమా కుటుంబం విజయం సాధించి... ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని చెప్పారు. తనపై పోటీకి ఎవరిని నిలబెట్టాలో కూడా నిర్ణయించుకోలేని స్థితిలో ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయని ఆమె త‌న‌దైన రేంజిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వెర‌సి ఈ వ్యాఖ్య‌ల ద్వారా అఖిల‌...  త‌న తండ్రి నాగిరెడ్డి కొన‌సాగించిన ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌ను మ‌రోమారు గుర్తు చేస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.


Full View

Tags:    

Similar News