ఈటెలతో పాటు వేటు పడే వారున్నారా?

Update: 2021-05-01 08:30 GMT
భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీనియర్ నేత ఈటెల రాజేందర్ వార్తల్లో నిలిచారు. తనపై వచ్చిన ఆరోపణను తీవ్రంగా తప్పుపట్టిన ఈటెల.. మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు వ్యవస్థలో ఉన్న అన్ని విచారణ సంస్థల చేత తన మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటు.. సీబీఐ చేత కూడా విచారణ చేయించాలని ఆయన కోరుతున్నారు. మరి.. ప్రభుత్వం ఏ తీరులో స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. ఈ రోజున (శనివారం) కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు.. వాటి తీరును చూస్తే.. ఈటెల మీద వేటు ఖాయమన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. మరి.. ఈటెల ఒక్కరిపైనే వేటు వేస్తారా? ఆయన బాటలో మరికొందరి పైన వేటు తప్పదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ సందర్భంగా రెండు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.

అందులో ప్లాన్ ఏ..
వేటు ఈటెలకు మాత్రమే పరిమితం చేయటం. ఎందుకంటే.. పార్టీ విషయంలోనూ.. అధినేత తీరుపైనా ఈటెల సానుకూలంగా లేరని.. అధికారాన్ని కొడుకు చేతికి అప్పగించే విషయంలో ఆయన విభేదిస్తుంటారని చెబుతారు. అయితే.. తన తర్వాత అధికార పగ్గాలు కొడుకు కేటీఆర్ చేతికి అప్పజెప్పాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకు తగ్గట్లే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అయితే.. ఈటెల.. ఆయన బాటలో ఉన్న కొందరి కారణంగా ఆ ప్రయత్నం అనుకున్నట్లుగా సాగలేదు. ఈ నేపథ్యంలో ఈటెల లాంటి బలమైన ప్రజాదరణ నేతను బద్నాం చేయటం ద్వారా.. తనతో పెట్టుకుంటే  ఎంతటి వారికైనా తిప్పలు తప్పవన్న సందేశాన్ని తెలిసేలా చేయటం.

దీంతో.. మిగిలిన వారంతా చప్పుడు చేయకుండా మానేస్తారని.. దశల వారీగా కేటీఆర్ నాయకత్వాన్ని ఇష్టపడని వారిని తప్పించే ప్లానింగ్ జరుగుతుందని చెబుతున్నారు. అయితే.. ఈ ప్రాసెస్ సుదీర్ఘంగా సాగేదే తప్పించి.. ఇవాళ మొదలు పెట్టి వారం రోజుల్లో ముగించే ప్రక్రియ కాదంటున్నారు. ఈ వ్యూహంలో డ్యామేజ్ తక్కువ జరగటంతో పాటు.. ఈటెల ఒక్కరి మీద చర్యలతో మిగిలిన వారందరికి బలమైన సందేశాన్ని పంపి.. ఈటెల లాంటి వాడికే తప్పలేదు.. మీరెంత? అన్న విషయాన్ని చెప్పటమే అసలు ఉద్దేశమంటున్నారు.

ప్లాన్ బి ఏమంటే..
ప్రక్షాళన మొదలు పెట్టినప్పుడు ఈటెల ఒక్కరిపైనే కాకుండా మరికొందరు పైనా వేటు వేయటం. దీనికి కారణం లేకపోలేదు. మంత్రి ఈటెల మీద భూకబ్జా ఆరోపణలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి కానీ.. మరికొందరు మంత్రుల మీద తరచూ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇద్దరు మంత్రులపైనా బోలెడన్ని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికి చూసిచూడనట్లుగా వ్యవహరిస్తూ.. సరైన టైం కోసం చూస్తున్న కేసీఆర్.. ఈటెల ఎపిసోడ్ తో పాటు ఆరోపణలు ఉన్న మంత్రులను ఇంటికి పంపించటం.

ఈ నిర్ణయంతో ఈటెల మీద చర్యలతో వచ్చే వ్యతిరేకతను.. నిజంగానే భూకబ్జా ఆరోపణలు భారీగా ఉన్న  వారి మీదా చర్యలు తీసుకోవటం ద్వారా.. భూవ్యవహారాల్లో మరకలు ఉన్న నేతలపై చర్యల కత్తిని దూశారన్న భావన కలిగేలా చేయటం మరో ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకు ఇద్దరు నుంచి ముగ్గురు మంత్రులపైనా వేటు వేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. ఈటెలతో పాటు కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు మంత్రులకు మూడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.
Tags:    

Similar News