రచ్చ రెండో సారి..

Update: 2015-04-20 17:30 GMT
ఈ మధ్య రాజకీయ నాయకులు బహిరంగ సమావేశాల్లో, పాత్రికేయ సమావేశాల్లో విమర్శలు చేసుకోవడం అనేదానికి తోడు చట్టసభలను వేదికగా చేసుకుంటున్నారు. మార్చి నెల అంతా దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలలో జరిగి "సానుకూల చర్చ"లను చూశాం. అదే సమయంలో పార్లమెంట్ లోనూ దాదాపుగా ఇదే సీన్ కనిపించింది. అయితే తాజాగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో మరోమారు అదే సీన్ రిపీట్ అవుతోంది.  
 
పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహజన్ ఇటీవల మృతి చెందిన మాజీ రాజ్యసభ ఎంపీలు, సింగపూర్ మాజీ  ప్రధాని లీక్వాన్‌ యూ, సుక్మా-దంతెవాడ పోలీసు అమరులు, కెన్యాఉగ్రవాది దాడిలో బలైపోయిన చిన్నారులకు.... నివాళులర్పిస్తూ సంతాన తీర్మానాన్ని చదివి వినిపించారు. అనంతరం విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టాయి. సోనియాగాంధీ తెల్లగా ఉండటం వల్లే ఆమెకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టారు, ఇంతకాలం ఉండనిచ్చారు అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసినవి అనుచిత వ్యాఖ్యలంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ఖర్గే మాట్లాడుతుండగా....బీజేపీ ఎంపీలు అడ్డుకోవడంతో సభలో దుమారం రేగింది. బీజేపీ సభ్యుల తీరుపై ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యలు యావత్‌ మహిళాలోకాన్ని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ యువ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. తమ పార్టీ అధినేతపై చేసిన వ్యాఖ్యలకుగాను ఆయన క్షమాపణలతో పాటు స్వచ్చంధంగా రాజీనామా చేయాలని, ప్రధాని నరేంద్రమోడీ కూడా క్షమాపణలు చెప్పాలని సింధియా డిమాండ్ చేశారు. దీనిపై కలగజేసుకున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విపక్ష సభ్యులు లేవనెత్తిన ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని తెలిపారు. స్పీకర్ అనుమతిస్తే చర్చించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న వెంకయ్య...గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై ప్రధాని మాట్లాడబోరని తేల్చిచెప్పారు. ఈ వివాదంలోకి ప్రధానిని లాగవద్దని సూచించారు. ఈ దశలో మరోసారి సభలో రగడ రేగడంతో స్పీకర్ సమావేశాలను 11.45 గంటల వరకూ వాయిదా వేశారు. 
 
వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ఇదే అంశంపై ఆందోళన కొనసాగించారు. దాంతో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్.. సోనియాగాంధీకి క్షమాపణ చెప్పారు.


Tags:    

Similar News