పార్టీ జెండా పండుగ‌ను ఘ‌నంగా చేద్దాం: మంత్రి కేటీఆర్

Update: 2021-08-31 10:30 GMT
సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహిద్దాం అంటూ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ కార్యక్రమాలను ప్రారంభించాలని , ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్టీ సర్పంచులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పార్టీ సంస్ధగత నిర్మాణంపైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమానికి గ్రామ, వార్డులో పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చేలా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలన్నారు. అదే రోజు డీల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. దీనితో పార్టీ ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. ఈ క్ర‌మంలో స్థానిక నాయ‌క‌త్వం పార్టీ జెండా పండుగ విజ‌య‌వంతానికి కృషి చేయాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.

పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జిలు, సీనియ‌ర్ నాయ‌కులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. ఈ జెండా పండగ త‌ర్వాత క‌మిటీల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని కేటీఆర్ సూచించారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు చేయాలన్నారు. సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సెప్టెంబర్ 2 వ తేదీ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక, జిల్లా అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నాయకత్వం సమన్వయం చేసుకొని ప్రకటిస్తుందని కేటీఆర్ తెలిపారు. జిల్లా కార్యవర్గాల ఎంపిక తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని కేటీఆర్ తెలిపారు.

పార్టీ కమిటీల కూర్పు విషయంలో కేటీఆర్ పలు సూచనులు చేశారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికే ఈ కమిటీలలో చోటు ఉంటుందన్నారు. పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్ టి, బిసి, మైనారిటీలు కచ్చితంగా 50 శాతం ఉండాలని, లేకుంటే అయా కమీటీలు చెల్లవు అని అన్నారు. అన్ని కమీటీల్లో మహిళా కార్యకర్తలకు తగిన చోటు కల్పించాలని సూచించారు.హైదరాబాద్ నగర విస్తృతి, జనాభా మరియు ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక నగర సమావేశం ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో బస్తి కమిటీ మరియు డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీల ఏర్పాటులో నగర ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రస్థాయి నాయకత్వం ఈ విషయంలో సమన్వయం చేసుకుంటు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారన్నారు. వచ్చే తోలి వారంలో ఈ సమావేశం ఉంటుందంటూ చెప్పారు.


Tags:    

Similar News