సైఫ్.. సంజయ్ ఎవరినీ వదలమన్న కేటీఆర్..కానీ ఆలస్యమైందే?

Update: 2023-02-28 11:04 GMT
అన్ని సందర్భాల్లో ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అవుదామంటే.. మొదటికే మోసం వస్తుంది. ఆలస్యంగా స్పందించిన దానికి అంతో ఇంతో మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఉదంతం రగిల్చిన వేడి అంతా ఇంతా కాదు. ఈ విషయంలో పలు సందేహాలు ఉన్నట్లుగా బాధితురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనికి తోడు.. ఆమె మరణం పలువురిని విషాదంలోకి నెట్టేస్తోంది. వేధింపుల కారణంగా.. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం.. ఈ ఉదంతంలో నిందితుడిగా ఉన్న సైఫ్.. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి బంధువు అన్న బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పినట్లైంది.

సైఫ్.. హోం మినిస్టర్ బంధువట.. ఆయన్ను ఏమైనా అనటానికి హెచ్ వోడీ సైతం భయపడతారంటూ ప్రీతి చెప్పేదన్న ఆమె సోదరి మాటలు తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. నిజానికి ఈ ఉదంతం వెలుగు చూసిన మొదటిరోజునే ప్రభుత్వం సీరియస్ గా స్పందించి.. కఠిన చర్యల దిశగా అడుగులు వేసి ఉంటే సరిపోయేది. కానీ.. అలాంటిదేమీ లేకపోవటం విమర్శలకు తావిచ్చేలా మారింది.  ఈ ఉదంతంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ప్రీతి ఘటనలో లవ్ జిహాద్ అనుమానాన్ని ఆయన వ్యక్తం చేయటంపై పలువురు తప్పు పడుతున్నా.. బండి నోటి నుంచి వచ్చిన మాటతో కేసీఆర్ ఇరుకున పడటమే కాదు.. అప్పటివరకు తాను పాటించిన మౌనానికి మంగళం పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రీతి విషయంపై ఇప్పటికే విపక్షాలు రియాక్టుఅయ్యాయి. ఇలాంటి సందర్భంలో ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కేసీఆర్ సర్కారు మీదపడింది. దీంతో.. తాజాగా మంత్రి కేటీఆర్ రియాక్టు అయ్యారు.

హన్మకొండ జిల్లాలో పర్యటించిన ఆయన.. ప్రీతి ఘటనపై మాట్లడారు. నిందితులను తాము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని తేల్చిన ఆయన.. ''అది సైఫ్ అయినా కానీ సంజయ్ అయినా కానీ. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ప్రీతి ఘటనను కొందరు కావాలనే రాజకీయంగా వాడుకుంటున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.

వరంగల్ ఎంజీఎంలో జరిగిన కాలేజీ గొడవల్లో మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధ పడ్డాం. మంత్రులు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వదిలిపెట్టం. తప్పకుండా చట్టపరంగా.. న్యాయపరంగా శిక్ష వేస్తాం'' అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

నిజమే.. కేటీఆర్ ఆగ్రహాన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆయన మర్చిపోతున్న విషయం ఏమంటే.. ఈ పరిస్థితి ఇంతవరకు రావటానికి కారణం.. తాము సమయానికి స్పందించకపోవటమే అన్నది కేటీఆర్ మర్చిపోకూడదు. ఏదైనా సంచలన ఉదంతం చోటు చేసుకున్నంతనే.. దానిపై ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు.. భవిష్యత్తులో ఆ తరహా ఘటనలు చోటు చసుకోకుండా ఉంటానికి చేసే ఏర్పాట్లతో పాటు.. ప్రభుత్వం కమిట్ మెంట్ తో ఈ మాటలు చెబుతుందన్న భరోసా కల్పిస్తే.. విషయం ఇంతవరకు వచ్చేది కాదు కదా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ప్రీతి వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వచ్చిన తర్వాత కేటీఆర్ ఎంత సీరియస్ గా స్పందించినా..ప్రభుత్వానికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News