మంత్రి నా​రా​య‌ణ‌కు స్ఫూర్తినిచ్చిన హ‌రీశ్‌

Update: 2015-07-22 09:15 GMT
రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు మంత్రుల‌కు రాజ‌కీయంగా ఒక‌రికొక‌రు అస్స‌లు ప‌డద‌న్న విష‌యం తెలిసిందే. ఏపీలోని ఏ లీడ‌ర్ ను అయినా స‌రే ఎలాంటి మొహ‌మాటం లేకుండా విమ‌ర్శించే ధైర్యం తెలంగాణ మంత్రి హ‌రీశ్ సొంత‌మైతే.. త‌న‌కున్న ప‌రిమితుల దృష్ట్యా ఏపీ మంత్రి నారాయ‌ణ ఎవ‌రిపైనా ఎలాంటి విమ‌ర్శ‌లు సంధించ‌కుండా కామ్‌ గా ఉంటారు.

ఇలాంటి భిన్న ధ్రువాలు ఒకే తీరులో వ్య‌వ‌హ‌రించటం కాస్తంత ఆస‌క్తి క‌లిగించే అంశం. గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా ట్రాఫిక్ జాంను క్లియ‌ర్ చేసేందుకు ఒక చేతిలో క‌ర్ర‌.. మ‌రో చేతిలో వాకీ టాకీ ప‌ట్టుకొని ఒక‌సారి.. మ‌రో్సారి తానే స్వ‌యంగా బైక్ న‌డ‌ప‌టం లాంటి సాహ‌సాలు తెలంగాణ మంత్రి హ‌రీశ్ చేయ‌టం తెలిసిందే. ఏదో ప్ర‌చారం కోసం అన్న‌ట్లుగా కాకుండా.. ట్రాఫిక్ జాంల‌ను క్లియ‌ర్ చేసే విష‌యంలో చాలా సీరియ‌స్‌ గా ప‌ని చేయ‌టం ప‌లువుర్ని ఆక‌ర్షించింది. అన్నింటికి మించి రోడ్డు మ‌ధ్య‌లో ఆగిన కారును తొలిగించేందుకు తానో మంత్రిన‌న్న విష‌యాన్ని వ‌దిలేసి మ‌రీ.. న‌లుగురితో క‌లిసి కారును ప‌క్క‌కు నెట్ట‌టం లాంటి చ‌ర్య‌లు హ‌రీశ్ ఎలాంటి భేష‌జాలు లేకుండా చేసేయ‌టం తెలిసిందే.

ఇలాంటి చ‌ర్య‌లు మీడియాలో చూసి ఏపీ మంత్రి నారాయ‌ణ స్ఫూర్తి పొందిన‌ట్లుగా ఉంది. బుధ‌వారం ఆయ‌న‌.. రాజ‌మండ్రిలోని పుష్క‌ర ఘాట్ల‌ను ప‌రిశీలించ‌టం.. ఏర్పాట్లను స‌మీక్షించ‌టంతో పాటు.. ట్రాఫిక్ ను ప‌రిశీలించేందుకు వీలుగా త‌న కారును వ‌దిలేసి బైక్ మీద కూర్చొని ప్ర‌యాణించ‌టం కాస్తంత విశేష‌మే.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బంది అభ్యంత‌రం చెప్పినా పట్టించుకోకుండా.. ఆయ‌న బైక్ మీద దూసుకెళుతున్నారు. మొత్తానికి ఏపీ మంత్రి నారాయ‌ణ‌కు హ‌రీశ్ బైక్ జ‌ర్నీ కొత్త స్ఫూర్తినిచ్చిన‌ట్లుంది
Tags:    

Similar News