ప్ర‌కాశం జిల్లాలో జ‌రిగితేనే ప్ర‌మాద‌మా... శిద్దా?

Update: 2017-03-03 11:39 GMT
రాష్ట్రంలో రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లుగా ఏపీ ర‌వాణా శాఖ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు చెబుతుంటారు. రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు ర‌చించామ‌ని,  వాటిని ద‌శ‌ల‌వారీగా అమ‌ల్లోకి తీసుకొస్తామ‌ని చెబుతున్న ఆయ‌న స‌మీప భ‌విష్య‌త్తుల్లోనే ఏపీకి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌ని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామ‌ని గొప్ప‌గా ప్ర‌క‌టించారు. అదే జ‌రిగితే... జ‌నం కూడా సంతోషిస్తారు. జ‌నాల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాన్ని ఏర్పాటు చేసిన శిద్దా రాఘ‌వ‌రావును జ‌నం ఏనాటికీ మ‌రిచిపోరు. అయితే ప్ర‌క‌ట‌న‌లైతే ఓ రేంజితో విడుద‌ల చేస్తున్న శిద్దా... ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. ఇటీవ‌ల జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌లు తీసుకుంటేనే ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

వైసీపీ నేత‌ల ఆరోప‌ణల వివ‌రాల్లోకెళితే... మూడ‌డు రోజుల క్రితం కృష్ణా జిల్లా నందిగామ స‌మీపంలో ఒడిశా నుంచి హైద‌రాబాదుకు నిండా ప్ర‌యాణికుల‌తో వ‌స్తున్న దివాక‌ర్ ట్రావెల్స్ కు చెందిన బ‌స్సు క‌ల్వ‌ర్టును ఢీకొట్టేసి డొంక‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 11 మంది చ‌నిపోగా.. 30 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న వెంట‌నే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హైద‌రాబాదు నుంచి ఘ‌ట‌నా స్థ‌లికి వెళ్లారు. అయితే... ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి కేవ‌లం 20 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న సీఎం నారా చంద్ర‌బాబునాయుడు గానీ. ఆయ‌న కేబినెట్ లోని ఇత‌ర మంత్రులు గానీ ఆ దిశ‌గా చూసిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత వైద్య‌ - ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నందిగామ వెళ్లి వ‌చ్చారు. ఇక మిగిలిన మంత్రుల అడ్రెస్ క‌నిపించ‌లేదు. ఇక రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణపై నిత్యం లెక్చ‌ర్లు దంచే ర‌వాణా శాఖ మంత్రి హోదాలో ఉన్న శిద్దా అయితే అడ్రెస్ లేర‌నే చెప్పాలి.

అయితే కేబినెట్ బాస్ గా ఉన్న సీఎం ఆదేశాల మేర‌కే ఆయ‌న నందిగామ‌కు రాక‌పోయి ఉండ‌వ‌చ్చు గాని... నిన్న త‌న సొంత జిల్లా ప్ర‌కాశం లోని పీసీ ప‌ల్లి మండ‌ల ప‌రిధిలో చోటుచేసుకున్న ఓ ప్ర‌మాదంపై మాత్రం చాలా క్విక్ గా రియాక్ట్ అయ్యారు. విద్యార్థినీల‌ను ఆల‌యాల సంద‌ర్శ‌న‌కు తీసుకెళ్లిన ఓ ప్రైవేట్ బ‌స్సు తిరుగు ప్ర‌యాణంలో భాగంగా డ్రైవ‌ర్ మ‌ద్యం సేవించి  డ్రైవింగ్ చేసిన కార‌ణంగా ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో 30 మంది చిన్నారుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. నిన్న తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ ప్ర‌మాదంపై నిన్న ఉద‌య‌మే వేగంగా స్పందించిన శిద్దా.. ప్ర‌మాద స్త‌లిని సంద‌ర్శించ‌డంతో పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలిక‌ల‌ను కూడా పరామ‌ర్శించారు. ఏం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, వైద్య ఖ‌ర్చుల‌న్నింటినీ ప్ర‌భుత్వమే భ‌రిస్తుంద‌ని కూడా ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.

ఈ ప‌రామ‌ర్శ‌ను ఏ ఒక్క‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు గానీ... కేవ‌లం గాయాలైతేనే ఈ రీతిలో స్పందించిన శిద్దా... 11 మంది ప్రాణాల‌ను బ‌లిగొన‌డంతో పాటు 30 మందిని గాయాల‌పాల్జేసిన నందిగామ ప్ర‌మాదంపై ఎందుకు స్పందించ‌లేద‌న్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్న‌. త‌న సొంత జిల్లాలో జ‌రిగితేనే ప్ర‌మాదం... ఇత‌ర జిల్లాల్లో జ‌రిగితే ప్ర‌మాదం కాదా? ర‌వాణా శాఖ మంత్రిగా శిద్దా ఒక్క ప్ర‌కాశం జిల్లాకు మాత్ర‌మే మంత్రా.. లేక రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు కూడా ఆయ‌న మంత్రేనా అన్న ప్ర‌శ్న‌ల‌ను వైసీపీ శ్రేణులు సంధిస్తున్నాయి. ఇదిలా ఉంటే... పీసీ ప‌ల్లి ప్ర‌మాదంపై వేగంగా స్పందించిన ప్రైవేట్ బ‌స్సు యాజ‌మాన్యంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని శిద్దా చెప్పారు. మ‌రి 11 మంది ప్రాణాల‌ను హ‌రించేసిన దివాక‌ర్ ట్రావెల్స్ పై చ‌ర్యల విష‌యంలో శిద్దా నోరు ఎందుకు పెగ‌ల‌డం లేద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థంగా మారింద‌నే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News