విడదల రజిని ఇప్పుడు హోం మంత్రి.. నెక్ట్స్‌ సీఎం ఏమో!

Update: 2023-06-14 11:09 GMT
ఏంటి.. హెడ్డింగ్‌ చూసి కంగారు పడుతున్నారా?.. విడదల రజిని ఎప్పుడు హోం మంత్రి అయ్యారనుకుంటున్నారా?.. ఆమె ప్రస్తుతం ఏపీలో వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ శ్రేణుల అత్యుత్సాహంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కాస్తా హోం మంత్రి అయిపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో 50 పడకలతో ప్రభుత్వ ఆస్పత్రిని వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆస్పత్రిని విడదల రజిని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అంతా ఓకే కానీ.. ఒక చోట మాత్రం పప్పులో కాలేశారు.

ఆ ఫ్లెక్సీలు, బ్యానర్లలో విడదల రజినిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కాకుండా హోం శాఖ మంత్రిగా పేర్కొన్నారు. 'మైలవరంలో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించడానికి వస్తున్న ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ మాత్యులు విడదల రజిని గారికి స్వాగతం, సుస్వాగతం' అంటూ పేర్కొన్నారు. దీంతో ఆ ఫ్లెక్సీలు, బ్యానర్లు చూసినవారు విస్తుపోయారు. విడదల రజిని ఎప్పుడు హోం మంత్రి అయ్యారబ్బా అని ఆరా తీశారు.

కాగా ప్రస్తుతం హోం శాఖ మంత్రిగా కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత ఉన్న సంగతి తెలిసిందే. అయితే రజినినే హోం శాఖ మంత్రి అని పొరపడ్డ వైసీపీ శ్రేణులు బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఆమెను హోం శాఖ మాత్యులుగా పేర్కొని తమ అజ్ఞానాన్ని చాటుకున్నారు.

విడదల రజిని వచ్చింది ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కదా.. అప్పుడైనా వైసీపీ శ్రేణులకు బల్బు వెలిగిందా అంటే లేదు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలతోపాటు పట్టణమంతా హోం శాఖ మంత్రి విడదల రజిని గారికి స్వాగతమంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఫొటోను ఏర్పాటు చేశారు. మరి ఈ విషయం ఆయన దృష్టికి వచ్చిందో, లేదో.

ఈ ఫ్లెక్సీల వ్యవహారాన్ని సోషల్‌ మీడియాలో ఎవరో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఏంటి తానేటి వనిత, విడదల రజిని శాఖలు మార్చుకున్నారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ శ్రేణుల బ్యానర్లలో హోం మంత్రిగా మారిపోయిన విడదల రజిని.. తర్వాత ముఖ్యమంత్రిగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

Similar News