మంత్రులు కుర్చీల‌కే.. సీఎంలు చెబితేనే ప‌నులు.. న‌మ్మ‌క‌పోయినా ఇదే నిజం!!

Update: 2022-12-14 05:00 GMT
మంత్రి అంటే.. ఎక్క‌డైనా ఏ రాష్ట్రంలో అయినా.. ప‌వ‌ర్ ఫుల్‌. మంత్రిగారు చెప్పారంటే.. ఉన్న‌తాధికారి నుంచి కిందిస్థాయి అధికారి వ‌ర‌కు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మ‌రీ ప‌నిచేయాలి. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా మంత్రి పేషీకి అందించాలి. ఇది ఎక్క‌డైనా రివాజు. మంత్రిగారి అధికారం అలాంటిది మ‌రి! కానీ, ఇది ఎక్క‌డైనా చెల్లుతుందేమో.. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవేమీ ప‌నికావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కొంద‌రు మాత్ర‌మే ప్ర‌త్యేకం అన్న‌ట్టుగా.. తెలంగాణ సీఎం కేసీఆర్  త‌ర్వాత ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ను మాత్రమే అధికారులు మంత్రిగా చూస్తున్నారు.

ఇదినిష్టుర స‌త్యం. మంత్రుల మ‌ధ్య జ‌రుగుతున్న సంభాష‌ణ‌లే దీనిని రుజువు చేస్తున్నాయి. ఇటీవ‌ల ఓ కీల‌క మంత్రి.. ఆయ‌న బీసీ వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, గ‌తంలో టీడీపీలో కూడా ప‌నిచేసి.. మంత్రిగా చ‌క్రం తిప్పారు. అయితే.. తెలంగాణ‌లో మంత్రి అయినా.. ఆయ‌న మాట‌ను అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోతున్నారు. దీంతో త‌న సొంత ప‌నికి సంబంధించి కూడా కేటీఆర్‌తో ఫోన్ చేయించుకోవాల్సిన వ‌చ్చింద‌ని స‌హ‌చ‌ర మంత్రి ముందు వాపోయారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇక‌, ఇటీవ‌ల వెలుగు చూసిన ఐటీ దాడుల‌తో రికార్డు స్థాయిలో ట్రోల్స్‌కు గురైన మ‌రో మంత్రి మ‌ల్లారెడ్డి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.  ఆయ‌న‌ను కూడా ఉన్న‌తాధికారులు ఎవ‌రూ లెక్క‌చేయ‌డంలేద‌ని.. అంటున్నారు.

ఇక‌, హోం మంత్రి గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకొంటే అంత మంచిది. క‌నీసం ఆయ‌న కానిస్టేబుల్‌ను కూడా క‌దిలించ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని సొంత పార్టీలో చ‌ర్చ సాగుతోంది. అంటే.. కేవ‌లం మంత్రులు ఉన్నారు.. వారి అధికారాలు మాత్రం మాంత్రికుడి ప్రాణంగా మారిపోయింద‌నే టాక్ వ‌స్తోంది.

ఏపీ విష‌యానికివ‌చ్చినా.. ఇదే ప‌రిస్థితి. ఏం చేయాల‌న్నా.. ఏం చెప్పాలన్నా.. అన్నీ సీఎం జ‌గ‌న్ , త‌ర్వాత స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి అనే టాక్ జోరుగా వినిపిస్తోంది. రాష్ట్రంలో రోడ్లు బాగోలేవు.. అని క‌థ‌నాలువ‌చ్చినా.. ఆర్టీసీ బ‌స్సులు ఎక్క‌డ‌బడితే అక్క‌డ చ‌తికిల ప‌డుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. స‌ద‌రు మంత్రి తాపీగా .. సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అనే చెబుతున్నారు. ఇక‌, కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం అయితే.. నియోజ‌క‌వ‌ర్గానికి ఎక్కువ‌.. అనే స్థాయిలో రాజ‌కీయాలు చేస్తున్నారు.

ఏపీలో హోం శాఖ‌ను ఎస్సీ మ‌హిళా నేత‌కు ఇచ్చినా.. ఆమెదీ తెలంగాణ లో మ‌హ‌మూద్ అలీ లాంటి ప‌రిస్తితే న‌ని వైసీపీ నాయ‌కులే చెవులుకొరుక్కుంటున్నారు. క‌నీసం స‌మీక్ష‌లు చేసే అధికారం కూడా ఈమెకు లేద‌నే టాక్ వినిపిస్తోంది. కానీ, అటు తెలంగాణ‌లోనూ.. ఇటు ఏపీలో సీఎంలు చెబుతున్న‌ది ఏంటంటే.. మేం అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చామ‌నే. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం మాంత్రికుడి క‌థే వినిపిస్తోంది.. క‌నిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News