ప్ర‌ణ‌య్ హంత‌కుడి అరెస్టు!

Update: 2018-09-18 10:59 GMT
మిర్యాలగూడలో సంచ‌ల‌నం రేపిన‌ ప్రణయ్ హ‌త్యోదంతం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై ప్ర‌ణ‌య్ ను అత్యంత‌ కిరాతకంగా ఓ కిరాయి హంత‌కుడు నరికి చంపిన వైనం ప్ర‌జ‌ల‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్ర‌ణ‌య్ ను చంపాల‌న్న క‌సితోనే ఆ హంత‌కుడు...పాశ‌వికంగా అత‌డిపై దాడి చేశాడు. సీసీటీవీ ఫుటేజిలో నిందితుడి ఆచూకి ల‌భించ‌డంతో అత‌డి కోసం పోలీసులు ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. బీహార్ కు చెందిన ఓ వ్య‌క్తి ఈ హ‌త్య‌కు పాల్పడినట్లు ఆ తరువాత పారిపోయిన‌ట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా, నేడు బిహార్ లో త‌ల‌దాచుకున్న క‌సాయి కిరాయి హంత‌కుడు సుభాష్ శ‌ర్మ‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ కు చెందిన శ‌ర్మ‌ను స్థానిక కోర్టులో హాజ‌రుప‌రిచిన త‌ర్వాత న‌ల్గొండకు త‌ర‌లించనున్నారు. ఈ రోజు సాయంత్రం అత‌డిని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశ‌ముంది.

ప్రణయ్ హత్యకు సంబంధించి ఏడుగురు నిందితులు ఉన్నారని న‌ల్గొండ ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ప్రణయ్‌ ను హత్య చేసింది బీహార్‌ కు చెందిన శర్మ అని ఆయ‌న వెల్ల‌డించారు. శ‌ర్మ‌ను బిహార్ నుంచి హైదరాబాదుకు తరలించి ఆపై న‌ల్గొండ‌కు త‌ర‌లిస్తామ‌న్నారు. ఈ హత్యకు రూ.1 కోటి డీల్ కుదిరిందని - రూ.18 లక్షలు ముందుగా చెల్లించారని తెలిపారు. కులాంతర వివాహం - కూతురిపై అతి ప్రేమ‌ - ఆమె త‌న‌కు ద‌క్కాల‌నే ఆశ‌తోనే మారుతిరావు ప్రణయ్ పైన కక్ష పెంచుకున్నారని ఎస్పీ తెలిపారు. అయితే, నయీం గ్యాంగుకు ప్రణయ్ హత్యతో సంబంధం లేదని ఎస్పీ తెలిపారు. గ‌తంలో అమృత మామ‌య్యను వేముల వీరేశం బెదిరించిన‌ట్లు కేసు న‌మోదైంద‌ని - దాని ప్ర‌కారం అమృత ...వీరేశం పేరు చెప్పి ఉంటుంద‌ని అన్నారు. అయితే, ఈ మూడు రోజుల విచార‌ణ‌లో ఈ హ‌త్య‌కు సంబంధించి వీరేశం పాత్ర లేద‌ని తెలిసింద‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు అమృత స్టేట్ మెంట్ రికార్డు చేయ‌లేద‌ని - ఒక‌వేళ ఆమె వీరేశంపై లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు ఇస్తే విచార‌ణ చేస్తామ‌ని అన్నారు. ఈ కేసును మూడు రోజుల్లోనే ఛేదించామని - ఈ హ‌త్య తెర వెనుక చాలామంది ఉన్నారని అన్నారు.
Tags:    

Similar News