టీడీపీ గెలిస్తే నేనే హోం మినిస్ట‌ర్‌.. అంద‌రి అంతు చూస్తా - అచ్చెన్నాయుడు

Update: 2021-02-02 14:17 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. త‌మ‌పార్టీ అధికారంలోకి వ‌స్తే.. తానే హోం మినిస్ట‌ర్ అవుతాన‌ని, అప్పుడు అంద‌రి అంతు చూస్తాన‌ని వ్యాఖ్యానించారు.

తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించిన అచ్చెన్నాయుడు.. ఈ కేసుల్ని చూసి భయపడే వ్యక్తిని కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబును కోరి హోంశాఖ తీసుకుంటానని, అప్పుడు అందరి సంగ‌తి చూస్తానని అన్నారు.

ఆయ‌నను‌ అరెస్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తున్న సమయంలో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. పోలీసు అధికారులు త‌న‌ప‌ట్ల‌ వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు.

కాగా.. మంగళవారం ఉదయం అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిమ్మాడలో టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా అచ్చెన్నాయుడు సతీమణి బరిలోకి దిగారు. ప్ర‌త్య‌ర్థిగా.. అచ్చెన్నాయుడి సోదరుడి కుమారుడు కింజార‌పు అప్పన్న వైసీపీ బలపర్చిన అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావించారు. అయితే.. ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌కుండా అప్పన్నను అచ్చెన్నాయుడు బెదిరించార‌నే అభియోగంపై ఆయ‌న‌పై కేసు నమోదైంది. దీంతో పోలీసులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన అనంతరం కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు అచ్చెన్నాయుడిని తరలించారు. అనంత‌రం న్యాయ‌స్థానం ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు. ఈ కేసు విచారించిన శ్రీకాకుళం స్థానిక కోర్టు అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా.. అచ్చెన్నాయుడి అరెస్టుతో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఎన్నికల ‘పంచాయతీ’ తారస్థాయికి చేరేలా కనిపిస్తోంది.


Tags:    

Similar News