ఇంటింటికీ టీడీపీతో త‌మ్ముళ్ల‌కు కొత్త స‌మ‌స్య‌

Update: 2017-09-15 12:16 GMT
ఇంటింటికీ తెలుగుదేశం పార్టీతో అధికార టీడీపీలో నెల‌కొన్న విబేధాలు భ‌గ్గుమంటున్నాయి. అందులోనూ తెలుగుదేశం పార్టీకి ప‌ట్టున్న జిల్లాగా పేరొందిన అనంత‌పురంలో ర‌చ్చ‌ర‌చ్చ‌గా అవుతోంద‌ని అంటున్నారు. జంప్ జిలానీల‌తో ఇటు త‌మ్ముళ్లు బాధ‌ప‌డుతుండ‌గా... త‌మ్ముళ్ల చ‌ర్య‌ల కార‌ణంగా పార్టీ ఫిరాయించిన నాయ‌కులు స‌త‌మ‌తమవుతున్నారు. కదిరి తెలుగుదేశం పార్టీలో మళ్లీ ఆదిపత్య పోరు మొదల‌యింద‌ని త‌మ్ముళ్లు చెప్తున్నారు. ఇందుకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం వేదిక అయిందని చెప్తున్నారు.

క‌దిరి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జి కందికుంట వెంకట ప్రసాద్ ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంపై పార్టీ మండల కన్వీనర్లు - ముఖ్య నాయకులు - కార్యకర్తలతో సమీక్ష నిర్వహించగా - ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌ బాషా సైతం తానేమీ తక్కువంటూ స్వగృహంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో జనచైతన్య యాత్రలు కూడా కందికుంట - అత్తార్ వేర్వేరుగా జరిగాయి.  ముగింపు సభకు కందికుంటనే స్వయంగా ఎమ్మెల్యే అత్తార్‌ ను ఆహ్వానించారు. అప్పటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం - కార్యకర్తల సంక్షేమం కోసం తానే ఓ మెట్టు దిగేందుకు సంకోచించనని, పార్టీని గత 15 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చానని - భవిష్యత్తులో కూడా కార్యకర్తలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై వుందని కందికుంట చెబుతూవస్తున్నారు.

ఎమ్మెల్యే అత్తార్ వైకాపా నుంచి టీడీపీలోకి చేరినప్పటికీ ప్రతినెలా నియోజకవర్గ సమన్వయక కమిటీ సమావేశాన్ని కందికుంట ఆధ్వర్యంలోనే నిర్వహిస్తుండగా - ఆ పార్టీ నాయకులు - కార్యకర్తలు సైతం ఆయనకే అండగా నిలుస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల టీడీపీ కన్వీనర్లు కందికుంట వెంటే నడుస్తూ వస్తున్నారు. దాదాపు పార్టీ క్యాడర్ అంతా ఆయన మాటే వేదంగా భావిస్తూ ఆయన నిర్వహించే పార్టీ సమావేశాలకు భారీ ఎత్తున హాజరవుతున్నారు. ఇక ఎమ్మెల్యే అత్తార్ మండల కేంద్రాల్లో మాత్రమే టీడీపీ కార్యక్రమాలకు హాజరవుతుండగా మండల కన్వీనర్లు - కార్యకర్తలు సహకారం అందించడంలేదని త‌న స‌న్నిహితుల‌తో వాపోతున్నారు. అంతేకాకుండా ఆది నుండి టీడీపీ అభివృద్ధికి కృషి చేసిన తమకు అడుగడుగునా అడ్డుతగులుతూ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి పనులు ఇస్తూ పరోక్షంగా వైకాపా నాయకులు కూడా సహకరిస్తున్నారని మండల పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. తమ పార్టీ కోసం పనిచేస్తుంటే అత్తార్ చాంద్‌ బాషాకు చెందిన వర్గం కేవలం కాంట్రాక్టుల కోసం పనిచేస్తున్నారని కందికుంట వర్గీయులు విమర్శిస్తున్నారు. అభివృద్ధి పేరుతో వైసీపీ నుండి అత్తార్ ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీలో చేరడమే తప్ప పెద్ద ఎత్తున అభివృద్ధికి పాటు పడలేదని, కేవలం ప్రతిపక్ష వైకాపా నాయకులను వదిలి టీడీపీకి ఆది నుండి పనిచేస్తున్న వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కందికుంట వర్గం వాదిస్తోంది.
Tags:    

Similar News