ఏపీ డిప్యూటీ సీఎంకు అనూహ్య నిర‌స‌న‌

Update: 2018-06-20 17:28 GMT
ఏపీలో అధికార టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ క‌ట్టుదాటుతోంది. పార్టీలో ప్రొటోకాల్ వివాదంపై చోటామోటా నేత‌లు త‌మ అసంతృప్తిని బ‌హిరంగంగానే వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఇలాంటి నిర‌స‌న తాజాగా ఏకంగా ఆందోళ‌న చేసే వ‌ర‌కు చేర‌డం గ‌మ‌నార్హం. సాక్షాత్తు ఉప‌ముఖ్య‌మంత్రి చిన్న‌రాజ‌ప్ప‌కే ఇలాంటి ప‌రాభవం ఎదుర‌వ‌డం గ‌మ‌నార్హం. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో బుధవారం ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌ను నూతన భవనం ప్రారంభోత్సవం సంద‌ర్భంగా  టీడీపీ శ్రేణులు ఆయ‌న్ను నిల‌దీయడం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

ఏపీఎస్పీ 14వ బెటాలియన్ ప్రారంభోత్స‌వానికి హోంమంత్రి - ఉప‌ముఖ్య‌మంత్రి అయిన చిన‌రాజ‌ప్ప ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే యామినిబాల‌కు త‌గిన గుర్తింపు ద‌క్క‌లేద‌ని ఆమె  అనుచ‌రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రొటోకాల్ ప్ర‌కారం త‌మ ఎమ్మెల్యేను గుర్తించ‌లేద‌ని పేర్కొంటూ ఆమెను ఎందుకు ఆహ్వానించలేదని ఉప‌ముఖ్య‌మంత్రి చినరాజప్పను నిలదీశారు. తెలుగు జాతి - సంప్ర‌దాయ‌ల‌ను గౌర‌వించే పార్టీలో మ‌హిళా ఎమ్మెల్యేకు ద‌క్కిన గుర్తింపు ఇదేనా అంటూ నాయ‌కులు - కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఉప‌ముఖ్య‌మంత్రికి ఇలాంటి ప్ర‌శ్న‌ల వ‌ర్షం ఎదుర‌వ‌డంతో స్థానికంగా గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసిన ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల్సి వ‌చ్చింది.
Tags:    

Similar News