రైసు మిల్లు సిబ్బందిపై చేయి చేసుకున్న గులాబీ ఎమ్మెల్యే

Update: 2023-05-07 15:01 GMT
మరక మంచిదే అన్న వాణిజ్య ప్రకటనకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కామారెడ్డి గులాబీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్  తాజాగా  హాట్ న్యూస్ గా మారారు. దీనికి కారణం ఆయన రైసుమిల్లు కు వెళ్లి అక్కడి సిబ్బంది పై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే.. ఆయన వర్గీయులు మాత్రం ఈ వీడియోతో నష్టం కంటే లాభమే ఉంటుందని చెబుతున్నారు. రైతుల పక్షాన నిలిచి..  ఫైట్ చేసినందు కు తమ ఎమ్మెల్యే సాబ్ కు మంచే జరుగుతుందని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..

నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్నప్పటికీ ధాన్యాన్ని తీసుకోని రైసు మిల్లుల తీరుతో రైతులు తెగ ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ శివారులో పూర్ణిమ రైసు మిల్లు ఉంది. అక్కడకు ధాన్యాన్ని తీసుకెళ్లిన రైతుల నుంచి వడ్లు తీసుకోవటం లేదు. ప్రభుత్వం చెప్పిన మేరకు తేమ శాతం ఉన్నప్పటికీ.. రైసు మిల్లు సిబ్బంది ధాన్యం సంచుల్ని దింపుకోవటం లేదన్న ఫిర్యాదు ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ కు వెళ్లింది.

దీంతో ఆయన ఆగ్రహంతో రైసుమిల్లు వద్దకు వచ్చారు. రైతులు తెచ్చిన వడ్లు ఎందుకు తీసుకోవటం లేదని ఆగ్రహంతో ప్రశ్నించారు. దీనికి సంబంధం లేని సమాధానాలు ఇవ్వటంతో.. కోపాని కి గురైన ఆయన రైసుమిల్లు సిబ్బంది పై చేయి చేసుకున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ గా మారింది. నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చినా ఏదో ఒక వంక పెట్టి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు.

రైతులు ఇబ్బందుల్ని.. కష్టాల్ని చూసి ఆవేశ పడ్డానే తప్పించి.. అందులోతనకు వ్యక్తిగత కక్షలు ఏమున్నాయి?అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే గంపా చేయి చేసుకున్న వైనం కొందరికి నచ్చకున్నా.. రైతులుమాత్రం తమ తరఫు పోరాడిన ఎమ్మెల్యే సాబ్ విషయంలో సంతోషంగా ఉండటం గమనార్హం.

Similar News