యువ నేత‌లు రోడ్డున ప‌డ్డా.. వైసీపీ అధిష్టానం మౌన‌మా...?

Update: 2021-09-24 03:30 GMT
తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఇద్ద‌రు యువ ప్ర‌జాప్ర‌తినిధులు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు అత్యంత ప్రియ‌మైన నాయ‌కులు.. కొన్ని రోజులుగా వీధి పోరాటాలు చేసుకుంటున్నారు. నువ్వా-నేనా అనుకుంటూ.. స‌వాళ్లు రువ్వుకుంటున్నారు. తాడో పేడో తేల్చుకుందాం రా! అంటూ.. ప్ర‌తిజ్ఞ‌లు చేస్తున్నారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. మీడియాలో పుంఖాను పుంఖాల వార్త‌లు వ‌స్తున్నా.. పార్టీ ఈఅధిష్టానం మాత్రం కిక్కురు మ‌న‌డం లేదు. పార్టీ ప‌రువు పోతున్నా.. మౌనంగా చూస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. తూర్పుగోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట‌. గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ వీచినా.. ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. పార్టీకి బ‌ల‌మైన కేడ‌ర్‌.. ఓటు బ్యాంకు రెండూ ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇక్క‌డి నేత‌లు స‌మ‌ర్ధవంతంగా.. క‌లిసిమెలిసి ప‌నిచేయాల‌ని.. జ‌గ‌న్ త‌ర‌చుగా చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో కొంద‌రు నాయ‌కులు క‌లిసి మెలిసి ప‌నిచేస్తున్నా.. మ‌రికొంద‌రు మాత్రం.. త‌ర‌చుగా వివాదాల‌కు దిగుతున్నారు. స‌వాళ్లు రువ్వుకుంటున్నారు. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర నాకే ప‌లుకుబ‌డి ఉంది.. నువ్వు బ‌చ్చా! అంటూ..ప‌రుష ప‌ద‌జాలంతో కామెంట్లు చేసుకుంటున్నారు. రాజ‌మండ్రి నుంచి గెలిచిన మార్గాని భ‌ర‌త్‌.. రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజాల ప‌రిస్థితి పార్టీని తీవ్ర సంక‌టంలోకి నెట్టింది. స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల్సిన ఈ నాయ‌కులు.. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట ఇసుక అక్ర‌మాలు.. అంటూ.. సొంత పార్టీ నేత‌ల‌పై ఎంపీ పోరు బాట ప‌ట్టారు.

ఇక‌, అప్ప‌టి నుంచి ఎమ్మెల్యే రాజా దూకుడు పెంచారు. దీంతో వీరి మ‌ధ్య వివాదాలు.. తాజాగా జ‌రిగిన ఓ ఉపాధ్యాయుడిపై దాడిఘ‌ట‌న మ‌రింత పెంచింది. అయితే.. ఇప్పుడు ఈ వివాదం మ‌రింత తార‌స్థాయికి చేరింది. ఇరువురు నాయ‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌రుష ప‌ద‌జాలంతో దూషించుకున్నారు.  నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎంపీ భరత్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు పిచ్చి ఎంపీగా, సినిమాట్రిక్స్‌ బొమ్మ చూపిస్తున్నారంటూ విమర్శలు చేశారు. నీ వెనుక రౌడీలు, భూమాఫియా ఉందని, హత్యలు చేసి ఆత్మహత్యలుగా మార్చే ఘనులు ఉన్నారని ఎంపీపై ఎమ్మెల్యే ఆరోపణ చేశారు.

ఈనేపథ్యంలో ఎంపీ భరత్‌ రాజమహేంద్రవరంలో.. ''నీలా నేను చీకటి రాజకీయాలు చేయను. నువ్వు చేసే ప్రతీ పని గురించి స్కూల్‌కు వెళ్లే పిల్లాడిని అడిగినా చెబుతాడు. నీవు పిలిస్తే వచ్చేది బ్లేడ్‌ బ్యాచ్‌, చైన్‌ స్నాచర్లు మాత్రమే. నేను పార్టీ గీచిన గీతను దాటను. నీవు నీ పరిధిలో ఉంటే మంచిది. లేదంటే రెండు రాష్ర్టాల్లో నా సత్తా ఏంటో చూపిస్తా. నీలాగే కిడ్‌లా ప్రవర్తిస్తే నీకు నాకూ తేడా ఉండదు. నా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో లెక్కలు చూసుకో. ఆవ భూములపై ఆరోపణలు చేయడం కాదు. రైతుల బ్యాంక్‌ ఖాతాల వ్యవహారాన్ని బయటపెడితే సంతోషిస్తా. ఎదుటివారిపై బురద చల్లితే అది నీ మీద కూడా పడుతుందని మర్చిపోవద్దు'' అని హితవు పలికారు.

ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు రెండు మూడు వర్గాలుగా చీలిపోయారు. రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ మౌనంగా ఉంటుండడంతో ఎంపీ రచ్చబండ, నగరబాట పేరిట డివిజన్ల వారీ పాదయాత్ర చేస్తూ సిటీలో పట్టు సాధించుకోవడం కోసం ప్రయత్నం మొదలెట్టారు. ఈ ప్రయత్నానికి చెక్‌ చెప్పడం కోసం జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌, సిటీ మాజీ కోఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం వర్గాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సిటీలో సుబ్రహ్మణ్యంకే ఒక వర్గం ఉంది. కానీ సిటీ కోఆర్డినేటర్‌ పదవి వదిలేసిన తర్వాత ఆయన మౌనంగా ఉండిపోయారు.

ఇటీవల కొందరు మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జిలు ప్రత్యేకంగా సమావేశమై మళ్లీ సిటీ రాజకీయాల్లో శ్రీఘాకోళ్లపు, జక్కంపూడి రాజా జోక్యం చేసుకుంటేనే పార్టీ బతికి బట్టకడుతుందని చెబుతూ మళ్లీ శ్రీఘాకోళ్లపును తెరమీదకు తీసుకుని రావడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ సుబ్రహ్మణ్యం రెండు మూడు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని, అధిష్ఠానం దృష్టికి ఇక్కడి విషయాలు తీసుకుని వెళతానని చెప్పడం గమనార్హం. కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఎంపీ వర్గం కార్యకర్తలు నేతలు కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు చీలిపోయారు.  

అయితే.. ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే ఇంతలా వీధిన ప‌డి ఒక‌రిపై ఒక‌రు తిట్టుకుంటున్నా.. నువ్వెంత అంటే..నువ్వెంత ! అంటూ.. విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నా.. పార్టీ అధిష్టానం ఇప్ప‌టి వ‌ర‌కు జోక్యం చేసుకోలేదు. ఒక‌వైపు పార్టీ ప‌రువు పోతోంది. మ‌రో వైపు.. పార్టీ నేత‌లు క‌కావిక‌లం అవుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ అధిష్టానం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల వైసీపీ రాజ‌కీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌.. టీటీడీ బోర్డు చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కూడా దీనిపై స్పందించ‌లేదు. మ‌రి ఇదే ర‌గ‌డ కొన‌సాగితే.. పార్టీ ప‌ల్చ‌న కాదా? అనేది వైసీపీ అభిమానుల ఆవేద‌న‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News