వైసీపీలో ఎంపీ vs ఎమ్మెల్యే.. జ‌గ‌న్ వ‌ద్ద ముగిసిన పంచాయితీ...!

Update: 2021-09-28 15:55 GMT
ఏపీలో అధికార వైసీపీ నేత‌ల మ‌ధ్య కొద్ది రోజులుగా విబేధాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. తొలి యేడాది పాటు ఎన్ని గొడ‌వ‌లు ఉన్నా పార్టీ నేత‌లు ఎవ్వ‌రూ రోడ్డెక్క‌లేదు. అయితే ఇప్పుడిప్పుడే పార్టీ నేత‌లు ధిక్కార స్వ‌రాలు పెంచుతున్నారు. పార్టీ అధిష్టానం వార్నింగ్ ఇస్తుంద‌న్న భ‌యం నిన్న మొన్న‌టి వ‌ర‌కు నేత‌ల‌కు ఉండేది. అయితే ఇప్పుడు ఎవ్వ‌రూ వాటిని లెక్క చేయ‌కుండా క్ర‌మ‌శిక్ష‌ణ గీత దాటేసి ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే చాలా మంది ఎంపీల‌కు మంత్రుల‌కు, ఎంపీల‌కు ఎమ్మెల్యేల‌కు ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. కొన్ని చోట్ల ఎంపీల‌కు ప్ర‌యార్టీ లేక‌పోవ‌డం.. వారి సిఫార్సుల‌ను ఎమ్మెల్యేలు ప‌ట్టించుకోక పోవ‌డం లాంటి కార‌ణాల‌తోనే ఈ నేత‌ల మ‌ధ్య విబేధాలు ర‌చ్చ కెక్కుతున్నాయి.

తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ వ‌ర్సెస్ రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా మ‌ధ్య యేడాదిన్న‌ర కాలంగా నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఇప్పుడు ర‌చ్చ‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. గ‌త వారం రోజులుగా ఇద్ద‌రూ నేత‌లు ఒక‌రిపై మ‌రొక‌రు ప్రెస్‌మీట్లు పెట్టి బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ విష‌యంలో ముందుగా రాజా భ‌ర‌త్‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టిన జేడీపై కేసులు వేయ‌డంతో పాటు టీడీపీ నేత‌ల‌తో కలిసి త‌న‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని విమ‌ర్శించారు.

ఆ వెంట‌నే భ‌ర‌త్ కూడా దీనికి కౌంట‌ర్‌గా ప్రెస్‌మీట్ పెట్టారు. ఎవ‌రేంటో ప్ర‌జ‌ల‌కు తెలుసని రాజాను విమ‌ర్శించారు. తాజాగా వీరి వివాదం మ‌రింత ముదిరితే పార్టీకి న‌ష్టం క‌లుగుతుంద‌ని భావించిన అధిష్టానం ఈ రోజు ఇద్ద‌రు నేత‌ల‌ను తాడేప‌ల్లి పిలిపించి పంచాయితీ పెట్టింది. గోదావ‌రి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్ వైవి. సుబ్బారెడ్డి వీరిని తాడేప‌ల్లి పిలిపించి ముందుగా ఇద్ద‌రి వాద‌న‌లు విన్నారు. అనంత‌రం వీరిద్ద‌రిని జ‌గ‌న్ పిలిపించుకున్నారు.

ఒక‌రిపై మ‌రొక‌రు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసుకోవ‌డంపై సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఎవరైనా పార్టీ గీత దాటితే స‌హించ‌న‌ని.. క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు ఉంటాయ‌ని జ‌గ‌న్ వీరితో చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇద్ద‌రికి కూడా జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చార‌ని పార్టీ నేత‌లు చెపుతున్నారు.ఇదిలా ఉంటే ఈ రోజు సీఎం జ‌గ‌న్‌తో జ‌రిగిన స‌మావేశంపై రేపు మీడియాతో మాట్లాడ‌తాన‌ని ఎంపీ భ‌ర‌త్ చెప్పారు.
Tags:    

Similar News