టీడీపీ ఎమ్మెల్యే రివ‌ర్స్ జంప్ చేస్తారా ?

Update: 2021-09-19 01:30 GMT
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో టీడీపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేత‌ల‌తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజక‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు కూడా పార్టీ మారిపోయారు. చివ‌ర‌కు టీడీపీ నుంచి గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు సైతం సైకిల్ దిగేసి ఫ్యాన్ కింద సేద‌తీరుతున్నారు. ఎవ‌రి అవ‌స‌రాలు వారివి. పార్టీ మారిన న‌లుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో త‌మ‌కు పెద్ద‌పీఠ వేస్తార‌న్న ఆశ‌తో వెళ్లిపోయారు. అయితే అక్క‌డ వారి ప‌రిస్థితి కూడా క‌క్క‌లేక మింగ‌లేక చందంగా ఉంది. గ‌న్న‌వ‌రంలో వంశీకి స్థానిక వైసీపీ కేడ‌ర్‌కు ప‌డ‌డం లేదు. చీరాల‌లో క‌ర‌ణం బ‌ల‌రాంకు మాజీ ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.

ఇక గుంటూరు ప‌శ్చిమంలో పార్టీ మారిన మ‌ద్దాలి గిరికి వైసీపీలో ఏకంగా లేళ్ల అప్పిరెడ్డి, ఏసుర‌త్నం, మోదుగుల ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది శ‌త్రువులు ఉన్నారు. ఇక విశాఖ ద‌క్షిణంలోనూ ఇప్పుడే ఇదే సీన్ ఉంది. అక్క‌డ పార్టీ మారిన వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్‌కు కోలా గురువులు, దివంగ‌త ద్రోణంరాజు శ్రీనివాస్ వ‌ర్గాలు అక్క‌డ బ‌లంగా ఉండ‌డంతో ఆయ‌న‌కు ఇబ్బంది త‌ప్ప‌డం లేదు. అలాగే జాన్ వెస్లీది మ‌రో గ్రూపు. దీనికి తోడు టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే రెహ్మ‌న్ కూడా ఓ గ్రూపు మెయింటైన్ చేస్తున్నారు. ఈ గ్రూపుల గోల‌తో అస‌లు వాసుప‌ల్లిని అక్క‌డ ప‌ట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఏప‌ని జ‌ర‌గాల‌న్నా వాసుప‌ల్లి కాకుండా పైన పేర్కొన్న నేత‌ల‌కే ముందు ప్ర‌యార్టీ ఇవ్వాల‌ని వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాసుప‌ల్లికే అక్క‌డ సీటు అని విజ‌య‌సాయి స్వ‌యంగా ప్ర‌క‌టించినా కూడా ఆయ‌న ఆనందం ఆరు నెల‌ల‌కే ఆవిరైపోయింది. అస‌లు చిన్న చిన్న ప‌నులు కూడా కావ‌డం లేదు. దీనికి తోడు ఇటీవ‌ల జ‌రిగిన వైజాగ్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి అనుకున్న సీట్లు రాలేదు. ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌భుత్వ అధికారుల‌పై చేసిన వ్యాఖ్య‌లు కూడా ఆయ‌న‌కు మైన‌స్‌గా మారాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న వైసీపీలో ఇమ‌డ లేక‌పోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో తిరిగి టీడీపీలోకి జంప్ చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న కూడా ఆయ‌న‌లో మొద‌లైపోయిందంటున్నారు. అయితే టీడీపీ నేత‌లు మాత్రం పార్టీ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిపిస్తే న‌మ్మ‌క ద్రోహం చేసి వెళ్లిన నేత‌ను తిరిగి పార్టీలో చేర్చుకుని.. మ‌ళ్లీ ఎలా టిక్కెట్ ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికే వాసుప‌ల్లి టీడీపీ నేత‌ల‌తో ట‌చ్లోకి వెళ్లిపోయిన‌ట్టు టాక్ ? మ‌రి టీడీపీ ఈ విష‌యంలో ఎలా స్పందిస్తుందో ? చూడాలి.




Tags:    

Similar News