ఆ బీజేపీ ఎమ్మెల్యే పదవి పోయింది

Update: 2019-11-03 06:19 GMT
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాల్ని హీటెక్కించేలా కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పవాయ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే బీజేపీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ లోథి అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యిందని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వటంపై బీజేపీ కుతకుతలాడుతోంది.

ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందన్న విషయంలోకి వెళితే.. ఒక పాత కేసులో బీజేపీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ దోషిగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో.. ఆయన పదవిని రద్దు చేస్తూ మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్ పీ ప్రజాపతి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో లోథి సభ్యత్వం రద్దు అయ్యిందని.. రాష్ట్ర అసెంబ్లీలో ఒక సీటు ఖాళీగా ఉందన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.

దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయటం రాజ్యాంగ వ్యతిరేకంగా చెబుతున్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వారు చెబుతున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయటం రాజ్యాంగ విరుద్దంగా వారు వాదిస్తున్నారు. స్పీకర్ నిర్ణయంపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు. మొత్తానికి కొత్త తరహా నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని తాము కూడా మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేస్తే సరిపోతుందన్న మాటను మరికొందరు బీజేపీ నేతలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించటం గమనార్హం.


Tags:    

Similar News