గ్రేట్.. మూటలు మోసుకుంటూ వెళ్లిన లేడీ ఎమ్మెల్యే

Update: 2020-05-04 05:42 GMT
ఫోటోలకు ఫోజులివ్వటం ప్రజాప్రతినిధులకు అలవాటే. అందులో భాగంగా వారు చేసే విన్యాసాలకు కొదవ ఉండదు. తనను ఎన్నుకున్న ప్రజల కోసం కమిట్ మెంట్ తో వ్యవహరించే నేతలు చాలా అరుదుగా ఉంటారు. కష్టంలో ఉన్న ప్రజల కోసం స్వయంగా మూటలు మోసుకుంటే వారి వద్దకు వెళ్లే ఎమ్మెల్యే ఎవరైనా కనిపిస్తారా? అది కూడా తెలుగు రాష్ట్రాల్లో అంటే.. నో అనేస్తారు అదాటున. కానీ.. ఇకపై అలా అనే అవకాశం లేనట్లే. తనను ఎన్నుకున్న వారి కోసం ఇప్పటివరకూ తెలుగు నేలపై ఏ ఎమ్మెల్యే చేయని పని చేయటం ద్వారా వార్తల్లోకి వచ్చారు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క.

కరోనా వేళ లాక్ డౌన్ కారణంగా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న గిరిజనుల కోసం పెద్ద సాహసాన్నే ఆమె చేవారు. గిరిపుత్రుల కోసం కొండకోనలు.. వాగులు వంకలు దాటి.. స్వయంగా తాను మోసుకెళ్లిన సామాన్లతో వారి ఆకలిని తీర్చే ప్రయత్నం చేశారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిదిలోని పెనుగోలు గిరిజన గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఖరీదైన కార్లలో ఒళ్లు మాత్రమే కాదు ఒంటి మీద వేసుకున్న ఖద్దరు బట్టలు నలగకుండా ఉండే ఎమ్మెల్యేలకు భిన్నంగా వ్యవహరించారు సీతక్క. మండే ఎండలో.. రాళ్లతో నిండిన బాటలో నడకదారిన.. చేతుల్లో సామాన్లతో నిండిన భారీ సంచుల్ని మోసుకుంటూ స్వయంగా రంగంలోకి దిగారు. ఆమెతో పాటు పలువురు అధికారులు వెళ్లారు. వారందరూ ఎవరు మోయగలిగినంతగా మూటల్ని మోసుకుంటూ వెళ్లారు.

తమతో తీసుకెళ్లిన నిత్యవసర వస్తువుల్ని వారికి అందజేశారు. లాక్ డౌన్ వేళ నిత్యవసర వస్తువులు అందక తీవ్ర అవస్థలు పడుతున్న వైనాన్ని తెలుసుకున్న సీతక్క.. తన నియోజకవర్గం కాకున్నా.. 15 కిలోమీటర్ల దూరాన్ని నడుచుకుంటూ వెళ్లటం ఒక ఎత్తు అయితే.. తానే స్వయంగా సరుకుల మూటను మోసుకెళ్లిన వైనం విస్మయానికి గురి చేస్తోంది.

కరోనా వేళ.. చాలామంది ఎమ్మెల్యేలు ఇళ్లల్లో నుంచి ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రావటానికి ససేమిరా అంటున్న వేళ.. అందుకు భిన్నంగా మహిళ అయి ఉండి.. మూటల్ని మోసుకుంటూ ప్రజలకు నిత్యవసరాలు అందించేందుకు చేసిన ప్రయత్నాల్ని పలువురు అభినందిస్తున్నారు. మే నెల ఎండల్లో అడవుల్లో నడుచుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే సీతక్క.. మార్గమధ్యంలో కనిపించిన వాగులో నీటిని తాగి దప్పిక తీర్చుకున్న వైనం అక్కడి వారిని కదిలించి వేసింది. మూములు రోజుల్లోనే పట్టని గిరిజనుల గురించి కరోనా వేళ.. సీతక్క స్పందించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి.. ఈ ఉదంతంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News