టీడీపీ 'కర్నూల్‌' వార్‌ లో లోకేష్ బలి.!

Update: 2019-02-18 04:23 GMT
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో  అధికార టీడీపీలో టిక్కెట్ల వార్‌ మొదలవుతోంది. పార్టీ నుంచి కొందరు నేతలు వైసీపీలోకి వెళ్తుండడంతో చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఈ సమయంలో సీట్ల కోసం ఇప్పటి నుంచి తమదంటే తమదే అంటూ కొందరు నేతలు వాదించుకుంటున్నారు. రాయలసీమలో కీలకంగా ఉన్న కర్నూలు అసెంబ్లీ సీటుపై ఇప్పుడు హాట్‌ హాట్‌ చర్చ సాగుతోంది. ఈ సీటుపై ఎస్వీ మోహన్‌ రెడ్డి - టీజీ వెంకటేశ్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో మొదలైన వార్‌  అధిష్టానానికి చేరింది.

2014 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటుపై టీడీపీ నుంచి ఎస్వీ మోహన్‌ రెడ్డి విజయం సాధించారు.ఈసారి కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం ఎంపీగా ఉన్న టీజీ వెంకటేశ్‌ తనయుడు భరత్‌ కూడా కర్నూలు నుంచి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది గమనించిన ఎస్వీ మోహన్‌ రెడ్డి ఈ సీన్‌ లోకి నారా లోకేశ్‌ ను తీసుకొచ్చారు.

కర్నూలు నుంచి పోటీలో నేనే ఉంటానని - లేకుంటే నారా లోకేశ్‌ పోటీ చేస్తే మాత్రం మద్దతు ఇస్తామని చెప్పారు. అయితే టీజీ వెంకటేశ్‌ కుటుంబానికి ఇస్తే ఊరుకునేది లేదని ఆయన  విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని టీజీ వెంకటేశ్‌ కు ఇవ్వకుండా చేస్తానని ఎస్వీ మోహన్‌ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.

టీజీ వెంకటేశ్‌ సైతం ఆదివారం రాత్రి స్పందించారు. ప్రతి విమర్శలకు దిగారు. పార్టీ టిక్కెట్‌ వ్యక్తులను కాకుండా సర్వేల ద్వారా కేటాయిస్తారని - చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందన్నారు. అలాగే లోకేశ్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తే తాము కూడా మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామన్నారు. గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వడం టీడీపీలో ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఇలా ఇద్దరు అభ్యర్థులు కర్నూలు సీటు కోసం లోకేష్ ను రంగంలోకి దించడం.. అస్సలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికే సాహసించని లోకేష్ ను ఇందులో ఇద్దరు నేతలు ఇరికించడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.



Tags:    

Similar News