అధికారులపై చేయి చేసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ

Update: 2017-01-07 06:19 GMT
అధికారంలో ఉన్నప్పుడు అణుకువగా ఉండాలి. ప్రజాసేవ చేస్తామని చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చే నేతలు.. అధికార మదంతో ఎలాంటి పని చేస్తారనటానికి ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరంలో చోటు చేసుకున్న ఘటన నిదర్శనంగా చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అన్నం సతీశ్.. ఆ తర్వాతి కాలంలోపార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు.

అధికారపక్ష నేతగా మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన ఆయన శుక్రవారం రాత్రి (అర్థరాత్రి అని కొందరు చెబుతున్నారు) ఆయన బాపట్లకు సమీపంలోని సూర్యలంక సముద్ర తీరంలోని ఏపీ పర్యాటక శాఖకు చెందిన రిసార్ట్ లో పార్టీ చేసుకున్నారు. దీనికి.. అధికారపక్షానికి చెందిన రేపల్లె ఎమ్మెల్యే  అనగాని సత్యప్రసాద్ తో పాటు మరో 28 మంది వరకు అనుచరులు వచ్చారు. మూడు ఏసీ కాటేజీలు అద్దెకు తీసుకొని విందు చేసుకున్న అన్నం సతీశ్.. రాత్రి10.30 గంటల వేళ రిసార్ట్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావును తన గదికి పిలిపించుకొని.. అతనిపై దాడి చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ సందర్భంగా అన్నం సతీశ్ అనుచర వర్గం రిసార్ట్ లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేసి.. భీతవాహ పరిస్థితిని సృష్టించారు. తనపై అధికారపక్ష ఎమ్మెల్సీదాడి చేసిన ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి బాధితుడు తీసుకెళ్లారు. దీంతో.. వారు హుటాహుటిన విజయవాడ నుంచి బయలుదేరి వచ్చారు. దారుణమైన విషయం ఏమిటంటే.. తమపై జరిగిన దాడి ఉదంతాన్ని బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. వారుఫిర్యాదు కూడా తీసుకోకపోవటం.

దీంతో.. పర్యాటక శాఖ అధికారులు గుంటూరులోని ఎస్పీ దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లబోయారు. ఫిర్యాదు తీసుకోవటానికి నో అంటే నో అన్నట్లుగా వ్యవహరించిన పోలీసులు.. బాధితులను పోలీస్ స్టేషన్ బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవటం సంచలనంగా మారింది. అధికారపక్ష నేతకు స్థానిక పోలీసులు ఎంతగా కొమ్ము కాస్తున్నారో చెప్పటానికి తాజా ఉదంతం నిదర్శనంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాడి చేసిన అధికారపక్ష ఎమ్మెల్సీపైన బాధితుడి ఫిర్యాదు తీసుకోని పోలీసుల తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. అధికారుల ఫిర్యాదునే పట్టించుకోని పోలీసులు.. సామాన్యుల ఫిర్యాదుల మాటేమిటన్న ప్రశ్న ఒకటైతే.. టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ హవా ఈ రేంజ్లో ఉంటుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News