వైసీపీకి ఉందిలే మంచికాలం..

Update: 2021-06-18 09:30 GMT
చ‌ట్ట స‌భ‌ల్లో బ‌లం అంటే చాలా మంది రాష్ట్రంలో శాస‌న స‌భ‌లోని ఎమ్మెల్యేల‌ను, కేంద్రంలో లోక్ స‌భ‌లోని ఎంపీల‌ను మాత్ర‌మే లెక్క‌లోకి తీసుకుంటారు. అక్క‌డ నెగ్గితే అయిపోయిన‌ట్టే అనుకుంటారు. ప్ర‌భుత్వం మ‌నుగ‌డ సాగించ‌డం వ‌ర‌కూ ఓకేగానీ.. బిల్లులు పాస్ కావాలంటే పెద్ద‌ల స‌భ‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిందే. రాష్ట్రంలో మండ‌లి, కేంద్రంలో రాజ్య‌స‌భ‌లో బిల్లులు నెగ్గితేనే చ‌ట్టాలుగా మారుతాయి.

ఈ విష‌యంలో బ‌లం లేక‌నే.. రాష్ట్రంలో అతికీల‌క‌మైన మూడు రాజ‌ధానుల బిల్లు వంటివి సైతం పెండిగులో ప‌డిపోయాయి. ఈ స‌మ‌స్య నుంచి వైసీపీ బ‌య‌ట‌ప‌డే స‌మయం వ‌చ్చేసింది. నేటితో ఏపీ మండ‌లిలో 8 మంది స‌భ్యులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్నారు. ఇందులో టీడీపీకి చెందిన వారే ఏడుగురు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామంతో వైసీపీ బ‌లం 21కి పెరుగుతుండ‌గా.. టీడీపీ బ‌లం 15కు త‌గ్గిపోతోంది. దీంతో.. ఇక‌, బిల్లులు నెగ్గించుకోవ‌డం అనేది వైసీపీకి న‌ల్లేరు మీద న‌డ‌క కానుంది.

మండ‌లి విష‌యంలో ఇలాంటి సానుకూల ప‌రిస్థితులు రాగా.. అటు రాజ్య‌స‌భ‌లోనూ ఇదేవిధ‌మైన ప‌రిస్థితి రాబోతోంది. వ‌చ్చే జూన్ లో ఏపీ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. వీరిలో ఒక‌రు వైసీపీకి చెందిన‌ విజ‌య‌సాయిరెడ్డి కాగా.. మిగిలిన ముగ్గురు బీజేపీకి చెందిన‌ సురేష్‌ప్ర‌భు, సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్ ఉన్నారు.

ఏపీ శాస‌న‌స‌భ‌లో వైసీపీకి ఉన్న బ‌లం దృష్ట్యా ఈ నాలుగు సీట్లూ.. వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. చూడ‌డానికి ఈ సంఖ్య చూడ‌డానికి చిన్న‌మొత్తంగానే క‌నిపించొచ్చు. కానీ.. రాజ్య‌స‌భ‌లో బీజేపీ ప‌రిస్థితి దృష్ట్యా ఇది ఎంతో కీల‌కం కానుంది. రాజ్య‌స‌భ‌లో బిల్లు పాస్ కావాలంటే.. 123 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు కావాలి. కానీ.. బీజేపీకి కేవ‌లం 93 మంది స‌భ్యులే ఉన్నారు. మిగిలిన ముప్పై మంది స‌భ్యుల కోసం ఇత‌ర పార్టీల‌పై ఆధార‌ప‌డాల్సిందే.

అంతేకాదు.. వ‌చ్చే ఏడాది దాదాపు 70 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఇందులో బీజేపీ స‌భ్యులు కూడా చాలా మందే ఉన్నారు. త‌ద్వారా బీజేపీ బ‌లం మ‌రింతగా ప‌డిపోనుంది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల వంటివి విదాస్ప‌దం కావ‌డంతో ప‌లు మిత్ర ప‌క్షాలు కూడా దూరం జ‌రిగాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో వైసీపీ మ‌ద్ద‌తు చాలా కీల‌కంగా మార‌నుంది. అప్పుడు.. కేంద్రం జ‌గ‌న్ స‌ర్కారుతో సానుకూలంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితులు అనివార్యంగా వ‌స్తాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విధంగా.. మున్ముందు వైసీపీకి అంతా మంచికాల‌మేన‌ని అంటున్నారు.
Tags:    

Similar News