జంపింగ్ ఎమ్మెల్యేపై త‌మ్ముడి ఫైర్

Update: 2018-05-04 08:26 GMT
జంప్ జిలానీ ప్రోత్స‌హించ‌డం వ‌ల్ల టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు క‌లిసివ‌చ్చింది ఎంటో తెలియ‌దు కానీ... పార్టీ కోసం ద‌శాబ్దాలుగా క‌ష్ట‌ప‌డ్డ టీడీపీ నేత‌ల్లో మాత్రం బాబుపై అసంతృప్తి పెల్లుబుకుతోంద‌ని స్ప‌ష్ట‌మవుతోంది. ఇప్ప‌టికే అనేక సంఘ‌ట‌న‌లు వివిధ జిల్లాల్లో ఇదే అంశాన్ని స్ప‌ష్టం చేయ‌గా తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత అయిన వైఎస్ జ‌గ‌న్ ఇలాకాలో మ‌ళ్లీ అదే ర‌చ్చ చోటుచేసుకోవ‌డంతో టీడీపీ శ్రేణులే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే జంపింగ్ ఎమ్మెల్యే - జ‌మ్మ‌ల‌మ‌డుగు శాస‌న‌స‌భ్యుడు ఆదినారాయ‌ణ రెడ్డిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి మ‌రోమారు మండిప‌డ్డారు.

టీడీపీ సీనియ‌ర్ నేత త‌మ పార్టీలోనే కొన‌సాగుతున్న ఫిరాయింపు నాయ‌కుడు కం మంత్రిపై మండిప‌డేందుకు కార‌ణం ఆయ‌న చేసిన కామెంట్లే.  అధిష్టానం ఆదేశాల‌ మేరకు ఇటీవల మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి ఎర్రగుంట్లకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం ఎర్రగుంట్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజ‌క‌వ‌ర్గంలో మూడుసార్లు గెలిచానని, మళ్లీకూడా గెలుస్తానని ప్ర‌క‌టించారు. రాబోయే కాలంలో కూడా గెలుస్తానని చెప్పారు. దీంతో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఆది అంటే భ‌గ్గుమ‌నే ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. ఇలా జంపింగ్ మంత్రి ప్ర‌క‌టించుకోవ‌డం పార్టీ టిక్కెట్లను ముందే ప్ర‌క‌టించిన‌ట్లు అవుతుంద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో - జిల్లాలో మంత్రులుకానీ - టీడీపీ జిల్లా అధ్యక్షుడు కానీ నియోజకవర్గ టిక్కెట్లు ప్రకటించే సాంప్రదాయం ఇప్పటి వరకు టీడీపీ చరిత్రలో లేనే లేదన్నారు. అలాంటిది పార్టీ మారిన నాయ‌కుడు త‌నంత తానుగా ప్ర‌క‌టించేసుకోవ‌డం ఏమిట‌ని విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

పార్టీని వ్యతిరేకించి తానే సుప్రీంలాగా జిల్లాలో వ్యవహరించి చెప్పడం తగదని రామ‌సుబ్బారెడ్డి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. నియోజకవర్గంలో తమ కుటుంబం పొన్నపురెడ్డి శివారెడ్డి - తాను పార్టీలో వినయవిధేయతలు కలిగిన పార్టీ అధిష్ఠానం చెప్పినట్లుగా నడుచుకున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తన చిన్నాన్న పొన్నపురెడ్డి శివారెడ్డి - తాను మంత్రులుగా కొనసాగామన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని పార్టీ అధిష్ఠానానికి తలనొప్పి కావడం సరైంది కాదని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తాను ఎమ్మెల్సీ పదవి చేపట్టే సమయంలో కూడా ఎంతో ఆలోచించానని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

Tags:    

Similar News