మోదీ అమెరికా పర్యటన ఫిక్స్ .. అధ్యక్షడితో కీలక భేటీ

Update: 2021-09-10 10:35 GMT
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. కరోనా వైరస్ కారణంగా ప్రధాని విదేశీ పర్యటనలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ లో పర్యటన మినహా ఆయన ఏ ఇతర దేశానికి వెళ్ల లేదు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత తొలి పర్యటనగా ఇప్పుడు అమెరికాకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు పర్యటన సాగనుంది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మోదీ తొలి సారిగా అమెరికా వెళ్తున్నారు.

అయితే ఆ ఇద్ద‌రూ ఇప్ప‌టికే మూడు సార్లు వ‌ర్చువ‌ల్‌ గాసమావేశం అయ్యారు. మార్చిలో క్వాడ్ మీటింగ్‌, ఏప్రిల్‌ లో వాతావ‌ర‌ణ మార్పులు, జూన్‌ లో జ‌రిగిన జీ-7 స‌ద‌స్సులో వాళ్లు క‌లుసుకున్నారు. ప్ర‌ధాని మోదీ 2019 సెప్టెంబ‌ర్‌ లో అమెరికా వెళ్లారు. అప్పుడు ఆయ‌న మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ను క‌లిశారు. హౌడీ మోడీ ఈవెంట్‌ లోనూ ఆయ‌న పాల్గొన్నారు. ఈ నెల 22న ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వాషింగ్టన్ బయలుదేరి వెళ్తారు. 23న అమెరికా అధ్యక్షడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. కరోనా పరిస్థితులు, ఆర్దిక అంశాలతో పాటుగా తీవ్రవావాదం, ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకున్న తాజా పరిణాల పైన చర్చించే అవకాశం ఉంది.

ఇప్పటికే ఆఫ్ఘన్ పరిణామాల పైన అమెరికా సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బ‌ర్న్స్‌ ఢిల్లీ వచ్చి వెళ్లారు. ఆయన భారత జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ఢిల్లీలో భేటి అయ్యారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌ లో ప‌రిస్థితుల‌పై వీళ్లిద్ద‌రూ చ‌ర్చించారని చెబుతున్నారు. 24న వాషింగ్టన్ లో జరిగే క్వాడ్ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశంలో మోదీతో పాటుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్, జపాన్ ప్రధాని యోషిదే సుగా ప్రసంగించనున్నారు. ఇక, 25న న్యూయార్క్ లో జరిగే కీలకమైన 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు.

ఐక్యరాజ్య సమితి ఆ సమావేశంలో మాట్లాడే స్పీకర్ల జాబితా విడుదల చేసింది. దీంతో ప్రధాని చేసే ఆ ప్రసంగం పైన ఆసక్తి నెలకొని ఉంది. కరోనా పరిస్థితులతో పాటుగా తీవ్రవాదం పైన ప్రధాని ఫోకస్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ లో తాజాగా తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడటం పైన భారత్ అధికారికంగా ఎక్కడా స్పందించ లేదు. అయితే, ప్రధాని ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం వేదికగా భారత్ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. చైనా, ఇండో ప‌సిఫిక్ అంశాల గురించి ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2014 లో మోదీ తొలి సారి ప్రధాని అయిన తరువాత ఇప్పటికి వరకు 60 దేశాలు సందర్శించగా, మొత్తంగా వంద విదేశీ పర్యటనలు చేసారు. ఇక, కరోనా కారణంగా దాదాపుగా ఏడాదిన్నారగా ఎటువంటి విదేశీ ప్రయాణం చేయలేదు. ఇక, ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ అమెరికా పర్యటన పైన ఆసక్తి నెలకొని ఉంది.
Tags:    

Similar News