మోడీషాల‌కు అగ్నిప‌రీక్ష‌..క్యూలో ఉప ఎన్నికలు

Update: 2018-05-27 05:52 GMT
ఏ స్టూడెంట్ కైనా ఏడాదికి ఒక్క‌సారే వార్షిక ప‌రీక్ష‌లు ఎదుర‌వుతాయి. కొంత‌మంది అదృష్ట‌వంతుల‌కు ఏడాదికి రెండుసార్లు ప‌బ్లిక్ ఎగ్జామ్స్ ను ఫేస్ చేయాల్సి వ‌స్తుంది. అదేం సుడో కానీ ప్ర‌ధాన‌మంత్రి మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల‌కు మాత్రం అదే ప‌నిగా ప‌రీక్ష‌లు ఎదురవుతున్నాయి. అది కూడా విష‌మ‌ప‌రీక్ష‌లుగా చెప్పాలి. కిందా మీదా ప‌డి.. త‌న స్థాయిని త‌గ్గించుకొని మ‌రీ ప్ర‌సంగాలు చేసిన త‌ర్వాత కూడా క‌న్న‌డ ప్ర‌జ‌లు మోడీని పూర్తిగా న‌మ్మ‌క‌పోవ‌టం.. అధికారానికి అడుగు దూరాన ఆపేయ‌టం తెలిసిందే.

అంద‌నంత దూరాన ఉన్న అధికారం అడుగు దూరానికి వ‌చ్చి ఆగిపోవ‌టంతో కిందా మీదా  ప‌డి.. ఎలాగైనా క‌ర్ణాట‌క పీఠాన్ని సొంతం చేసుకోవాల‌నుకున్నారు. కానీ.. వ‌ర్క్ వుట్ కాలేదు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. అవి కాస్తా కొలిక్కి రాని వేళ‌.. ఊహించ‌నిరీతిలో ఎదురైన ఓట‌మితో వారికి దిమ్మ తిరిగి పోయిన ప‌రిస్థితి. సౌత్ లో పాగా వేశామ‌ని తెగ సంబ‌రప‌డిపోయిన క‌మ‌ల‌నాథుల‌కు క‌ర్ణాట‌క రాజ‌కీయం ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు.

ఈ ఓట‌మి భారం నుంచి ఇంకా బ‌య‌ట‌కు రాక ముందే.. మ‌రో పెద్ద అగ్నిప‌రీక్ష మోడీ మాష్టారికి ఎదురైంది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌ల‌కు న‌గ‌రా ఎప్పుడో మోగింది. ప‌ది రాష్ట్రాల్లో నాలుగు లోక్ స‌భ‌.. ప‌ది అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల‌కు తెర లేచింది. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించిన కీల‌క‌మైన పోలింగ్ మే 28 జ‌ర‌గ‌నుండ‌గా.. 31న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. తాజాగా జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లు ప‌ది రాష్ట్రాలకు సంబందించి నాలుగు లోక్ స‌భ‌.. ప‌ది అసెంబ్లీ స్థానాలు. వీటిల్లో కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. మ‌హారాష్ట్ర.. నాగాలాండ్.. పంజాబ్‌.. బిహార్.. కేర‌ళ‌.. మేఘాల‌య‌.. ఉత్త‌రాఖండ్‌.. ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్నాయి.

మొన్నీమ‌ధ్య‌నే జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ కంచుకోట లాంటి  యూపీలో ఎదురుదెబ్బ తగిలిన విష‌యం తెలిసిందే. తాజా ఉప ఎన్నిక‌ల్లో కానీ అదే సీన్ రిపీట్ అయితే మాత్రం మోడీషాల‌కు ఎదురుగాలి మొద‌లైన‌ట్లే. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒకేసారి జ‌రుగుతున్న ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ రాజ‌కీయాల మీదా.. మోడీ పాల‌న‌కు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ గా ప‌ని చేస్తాయంటున్నారు. ఉప ఎన్నిక‌లు ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో జ‌రుగుతున్నా.. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో మోడీ ఫ్యాక్ట‌ర్ ఫ‌లితం మీద ప్ర‌భావం చూపుతుందంటున్నారు. మ‌రి.. 14 ప‌రీక్ష‌ల్లో మోడీషాల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ ర‌కంగా ఉంటుంద‌న్న‌ది తేలాలంటే ఈ నెల 31 వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News