ఉమ్మడి పౌరస్మృతిపై మోడీ సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-06-27 15:03 GMT
ఉమ్మడి పౌరస్మృతి, యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోడీ. దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఉందని ఉద్ఘాటించారు. దేవానికి యూనిఫాం సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అవసర ఉందని అన్నారు. ఈ విషయంలో ముస్లింలను కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రెచ్చగొడుతున్నాయని ప్రధాని మండిపడ్డారు!

"మేరా బూత్‌ - సబ్‌ సే మజ్‌ బూత్‌" పేరుతో నిర్వహించిన భోపాల్‌ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బూత్‌ లెవెల్‌ కార్యకర్తలతో సమావేశం కావడం ఆనందంగా ఉందని మోదీ తెలిపారు. వర్చువల్‌గా 10 లక్షల మంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా కృషి తోనే ఇది సాధ్యమయ్యిందని అన్నారు.

మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా... ముందుగా భోపాల్ సిటీలోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి 5 వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను మోడీ ప్రారంభించారు. రైళ్లకు పచ్చజెండా ఊపడానికి ముందు ప్రధాని అక్కడి రైలు సిబ్బంది, వందేభారత్ ఎక్స్‌ ప్రెస్‌ లో ప్రయాణానికి సిద్ధమైన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన మోడీ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ కూతురుకి లాభం చేయాలనుకుంటే బీఆరెస్స్ పార్టీకి ఓటు వేయండి. మీకు, మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వెయ్యండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కుటుంబ పాలనపై భోపాల్ సభలో మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆరెస్స్, బీజేపీ ఒక్కటే అని ప్రచారం జరుగుతున్న వేళ ప్రధాని మోడీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కాగా... మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ లలో గత ఎన్నికల్లో మోడీ ఈ మేరకు ప్రధానంగా ఎన్నికల హామీలిచ్చారు. ఇందులో భాగంగా... బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలలో అయోధ్య రామమందిరం, కశ్మీర్‌ కు స్వయంప్రతిపత్తి తొలగించడం, యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం ముఖ్యమైనవిగా చెప్పిన సంగతి తెలిసిందే.

మతం, లింగం వంటి వాటితో సంబంధం లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం అంటే.. యూనిఫాం సివిల్ కోడ్‌ ను తీసుకురావాలనే డిమాండ్ దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-44 కూడా ఇదే చెబుతోంది. అయితే దేశంలో మెజారిటీ అయిన హిందువులు, మైనారిటీ అయిన ముస్లింలు ఈ యూనిఫాం సివిల్ కోడ్‌ ను వ్యతిరేకిస్తూ వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు.

ఇదే సమయంలో... భిన్న మతాలు, నమ్మకాలు ఉన్న భారత్ వంటి పెద్ద దేశాల్లో సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడమనేది చాలా కష్టమైన విషయం అని పలువురు మేధావులు చెబుతుంటారు. ఇందులో భాగంగా... యూనిఫాం సివిల్ కోడ్ వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని.. బీజేపీ ఎవరికైతే ప్రతినిధులుగా ఉంటామని చెబుతూ ఉంటుందో ఆ హిందువులకు కూడా ఇది నష్టం చేస్తుందని పొలిటికల్ సైంటిస్ట్ అసీం అలీ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

Similar News