మోడీకి వ‌రుస షాకులిస్తున్న మిత్రులు

Update: 2017-10-31 06:09 GMT
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి గుర్తుకు తెచ్చేలా ప్ర‌య‌త్నాలు ఇప్పుడు మొద‌ల‌య్యాయి. తిరుగులేని అధిప‌త్యంతో అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న మోడీ.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌నే కాదు.. మిత్ర‌ప‌క్షాల‌కు మింగుడ‌ప‌డ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించట‌మే కాదు..  సంకీర్ణ ధ‌ర్మాన్ని విస్మ‌రించారు. త‌మను.. త‌మ డిమాండ్ల‌ను తుంగ‌లోకి తొక్కేసిన మోడీపై గొంతుల వ‌ర‌కు అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ కిమ్మ‌న‌కుండా ఉన్న  మిత్ర‌ప‌క్షాలు స‌రైన స‌మ‌యం కోసం ఎదురు చూశాయి.

ఎప్పుడైతే జీఎస్టీ ప‌న్నుల విధానం అమ‌ల్లోకి వ‌చ్చి.. ప్ర‌భుత్వంపైనా.. మోడీపైనా ప్ర‌జ‌ల్లో అసంతృప్తి స్టార్ట్ అయ్యిందో  మిత్ర‌ప‌క్షాలు ఒక్కొక్క‌రిగా గొంతు విప్ప‌టం మొదలెట్టాయి. మోడీ తీరును నేరుగా త‌ప్పు ప‌ట్ట‌క‌పోయినా.. ఆయ‌న‌కు రాజ‌కీయంగా బ‌ద్ధ‌శ‌త్రువైన రాహుల్ గాంధీ స‌మ‌ర్థ‌త‌ను ప్ర‌శంసించ‌టం మొద‌లెట్టారు. రాజుగారి రెండో భార్య చాలా మంచిదంటే.. పెద్ద భార్య ముచ్చ‌ట‌ను చెప్ప‌క‌నే చెప్పేసిన తీరులోనే రాహుల్ స‌మ‌ర్థ‌త‌ను పొగ‌డ‌టం మొద‌లెట్టారు. ఇది బీజేపీ అధినాయ‌క‌త్వానికి అస్స‌లు న‌చ్చ‌టం లేదు.

రాహుల్ స‌మ‌ర్థుడ‌ని.. ఆయ‌నేమీ ముద్ద‌ప‌ప్పు కాద‌ని.. దేశాన్ని న‌డిపించ‌గ‌ల స‌త్తా ఆయ‌న‌కు ఉంద‌న్న మాట‌ను ఏ కాంగ్రెస్ నేతో అన‌కుండా.. ప్ర‌ధాన‌మంత్రి క్యాబినెట్ లో మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్ర‌మంత్రి రాందాస్ అథావ‌లే వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. రిప‌బ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత‌గా వ్య‌వ‌హ‌రించే అథావాలేను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌దు. ఎందుకంటే ఆయ‌న నాలుగుసార్లు పార్ల‌మెంటుకు ఎన్నిక‌య్యారు.

ఈయ‌నొక్క‌రే కాదు.. మోడీకి మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌రో మిత్రుడు.. బీజేపీకి న‌మ్మ‌క‌స్తుడైన స్నేహితుడిగా చెప్పే శివ‌సేన సైతం మోడీ మీద అసంతృప్తితో ర‌గిలిపోతోంది. ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల్ని సంధించే ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌టం లేదు. తాజాగా.. ఆ పార్టీ ఎంపీ సంజ‌య్ రావ‌త్ సైతం రాహుల్ ను ప్ర‌శంసించ‌ట‌మే కాదు బ‌ల‌మైన నేత కాగ‌ల‌డ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసి మోడీ బ్యాచ్‌ కు మంట పుట్టించారు.

రావ‌త్  ప్ర‌క‌ట‌న‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మోడీ విధేయుడు క‌మ్ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌విస్ వివ‌ర‌ణ కోరినా.. ఆయ‌న మాత్రం లైట్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారే త‌ప్ప తాను చేసిన వ్యాఖ్య‌పై వివ‌ర‌ణ మాత్రం ఇవ్వ‌టం లేదు. గ‌డిచిన మూడున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో మోడీ తీరుతో విసిగిపోయిన మిత్రులు.. స‌రైన టైం కోసం ఎదురుచూశాయ‌ని చెప్పాలి. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై మొద‌ట్లో దేశ ప్ర‌జ‌లు పాజిటివ్ గా రియాక్ట్ అయిన‌ప్ప‌టికీ.. రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. అదో విఫ‌ల ప్ర‌య‌త్న‌మ‌న్న భావ‌న క‌లుగ‌జేసేలా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

అదే స‌మ‌యంలో జీఎస్టీ అమ‌లు నిర్ణ‌యం కూడా ఊహించ‌ని రీతిలో మోడీకి షాకివ్వ‌టం క‌మ‌ల‌నాథులకు మింగుడుప‌డ‌టం లేదు. మోడీ తీరును నేరుగా విమ‌ర్శించ‌లేని మిత్ర‌ప‌క్షాలు తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. రాహుల్ ను పొగ‌డ‌టం ద్వారా.. ఆయ‌న స‌మ‌ర్థ‌త‌పై సానుకూల‌త‌ను వ్య‌క్తం చేయ‌టం ద్వారా మోడీపై త‌మ‌కున్న కోపాన్ని బ‌య‌ట‌పెడుతున్నాయి. ప్ర‌జ‌ల్లో మోడీపై వ్య‌తిరేక‌త పెరిగింద‌న్న సంకేతాల్ని గుర్తించిన మిత్ర‌ప‌క్షాలు.. ఆయ‌న‌పై ఒత్తిడి పెంచ‌టంతో పాటు.. త‌మ‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్న దానికి త‌గిన మూల్యం చెల్లించాల‌న్న ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌టం గ‌మ‌నార్హం.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ మిత్రుల అవ‌స‌రాన్ని గుర్తించిన మోడీ.. వారితో ఆచితూచి వ్య‌వ‌హ‌రించేవారు. క‌లిసి క‌ట్టుగా కాంగ్రెస్ అండ్ కోకు షాక్ ఇవ్వాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించేవారు. ఎప్పుడైతే సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీ బ‌లాన్ని.. మోడీపై దేశ ప్ర‌జ‌ల‌కున్న న‌మ్మ‌కం ఎంత‌న్న‌ది తెలిసిందే.. అప్ప‌టి నుంచి మోడీ తీరు మారిపోయింది. ఎన్నిక‌ల వేళ‌లో మిత్రుల‌కు పెద్ద‌పీట వేస్తూ.. వారికి హామీలు ఇవ్వ‌ట‌మే కాదు.. మిత్ర‌ప‌క్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను ప్ర‌ద‌ర్శిస్తామ‌న్న హామీని ఇచ్చారు.

కానీ.. ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం మొద‌లెట్టారు. ఇందుకు ఏపీనే అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. దేశ రాజ‌ధానిని త‌ల‌ద‌న్నేలా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మిస్తామ‌ని చెప్పిన ఆయ‌న‌.. రాజ‌ధాని శంకుస్థాప‌న‌కు వ‌చ్చిన మోడీ గిన్నెడు నీళ్లు.. మ‌రో గిన్నెడు మ‌ట్టిని ఏపీ ముఖ్య‌మంత్రి చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీకి ఇచ్చిన హామీని తుంగ‌లోకి తొక్క‌ట‌మే కాదు.. ప్ర‌త్యేక ప్యాకేజీ అంటూ ముష్టిని విదిలించిన‌ట్లుగా విదిలించారు.

పేరుకు ఎన్డీయే స‌ర్కారు అయిన‌ప్ప‌టికీ నిర్ణ‌యాల‌న్నీ మోడీనే ఏక‌ప‌క్షంగా తీసుకునే ధోర‌ణి పెరిగిపోయింది. సంకీర్ణ ప్ర‌భుత్వంలో మిత్ర‌ప‌క్షాల‌కు పెద్దపీట వేయ‌ట‌మే కాదు.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే విష‌యంలో వారి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టాన్ని వ‌దిలేశారు. దీనిపై తీవ్ర‌మైన అసంతృప్తి మోడీ మిత్రుల్లో ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లో ప్ర‌ధాని ప‌ట్ల ఉన్న న‌మ్మ‌కానికి త‌లొగ్గి త‌మ‌దైన రోజు కోసం ఎదురుచూస్తున్నారు. జీఎస్టీతో అలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డ‌టం.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కుమారుడిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు మిత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని తెస్తున్నాయి.

త‌మ‌ను పూచిక పుల్ల‌గా చూస్తూ.. ప‌క్క‌న పెట్టిన మోడీకి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వ‌టం మొద‌లెట్టారు. మోడీపై నేరుగా విమ‌ర్శ‌లు చేయ‌కుండా.. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని పొగ‌డ‌టం ద్వారా షాకులివ్వ‌టం స్టార్ట్ చేశారు. మోడీ ఏ రీతిలో అయితే మాట అన‌కుండా మిత్రుల‌ను ఒక ఆట ఆడించారో.. ఇప్పుడు అదే తీరులో మిత్రులు వ్య‌వ‌హ‌రించ‌టం గ‌మ‌నార్హం. మారిన ప‌రిణామాలు మోడీకి మింగుడుప‌డ‌టం లేద‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌ల్లో త‌న‌పై పెరిగే అసంతృప్తికి త‌గ్గ‌ట్లే మిత్రులు గొంతు విప్పుతార‌న్న విష‌యాన్ని అర్థం చేసుకున్న‌ట్లే.  ప్ర‌జ‌ల్లో త‌న‌పై పెరిగిపోతున్న అసంతృప్తికి.. మిత్రుల వాయిస్‌కు ముకుతాడు వేసేలా మోడీ ఏం మేజిక్ చేస్తార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News