చైనా కంపెనీలకు భారీ షాక్.. మోడీ సర్కారు అలాంటి నిర్ణయం తీసుకుందా?

Update: 2022-08-09 04:39 GMT
ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్ బెర్గ్ సంచలన కథనాన్ని ప్రచురించింది. మోడీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంగా పేర్కొంటూ ప్రచురించిన కథనం ఇప్పుడు వాణిజ్య వర్గాల్లో షాకింగ్ గా మారింది. తాజాగా ప్రకటించిన కథనం నిజమైన పక్షంలో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు మోడీ సర్కారు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయాన్ని తీసుకున్నట్లేనని చెప్పాలి. అయితే.. తాము వెల్లడించిన నిర్ణయం దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తుందని సదరు కథనంలో పేర్కొన్నారు. ఇంతకూ విషయం ఏమంటే.

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.12 వేల కంటే తక్కువ ధరలో ఉన్న స్మార్ట్ ఫోన్లు అత్యధికం చైనాకు చెందినవే కావటం తెలిసిందే. మొత్తం అమ్మకాల్లో 80 శాతం చైనా కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లే ఉంటాయి. ముఖ్యంగా షావోమి.. రియల్ మీ.. ఒప్పో.. వివో కంపెనీలు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ మీద గట్టి పట్టు సాధించాయి.

ఇదిలా ఉంటే.. తాజా కథనం ప్రకారం చైనాకు చెందిన మొబైల్ కంపెనీలకు షాకిచ్చేలా మోడీ సర్కారు నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.12వేల లోపు ధర ఉన్న స్మార్ట్ ఫోన్లను భారత్ లో అమ్మటానికి వీల్లేని విధంగా బ్యాన్ విధించాలన్నది మోడీ సర్కారు ఆలోచనగా పేర్కొంది.

ఈ నిర్ణయం కానీ అమల్లోకి వస్తే.. దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీలకు కొత్త ఊపిరిని ఇస్తుందని చెబుతున్నారు. నిజానికి షావోమీ.. రియల్ మీ.. ఒప్పో లాంటి కంపెనీల మొబైల్ ఫోన్లకు ముందు మైక్రో మ్యాక్స్.. లావా.. లాంటి దేశీయ కంపెనీల మొబైల్ ఫోన్లకు గిరాకీ ఉండేది. ఎప్పుడైతే చైనా కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయో.. మార్కెట్ లో సింహ భాగం వ్యాపారాన్ని అవి చేజిక్కించుకున్నట్లుగా చెప్పాలి. బడ్జెట్ ఫోన్ల అమ్మకాల్లో చైనా కంపెనీలదే పైచేయి.

మోడీ సర్కారు తాజా నిర్ణయం చైనా కంపెనీలకు నేరుగా తగిలేలా ఉండనుందన్న మాట వినిపిస్తోంది. బ్లూమ్ బెర్గ్ కథనం నిజమైతే చైనా కంపెనీలకు భారీ దెబ్బ తగలనుంది. అదే సమయంలో దేశీయ మొబైల్ కంపెనీలకు కొత్త బలాన్ని ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు.

మోడీ సర్కారు నిర్ణయం వల్ల యాపిల్.. శాంసంగ్ లాంటి కంపెనీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెబుతున్నారు. ఎందుకంటే.. వీరి ఉత్పత్తులన్ని రూ.12వేలకు పైనే ఉండటంగా చెప్పొచ్చు. మరి.. బ్లూమ్ బెర్గ్ కథనం వాస్తవరూపం ఎప్పటికి దాలుస్తుందో చూడాలి.
Tags:    

Similar News