మేరా భారత్ మహాన్: తేడాలున్నా కష్టం వస్తే అపన్నహస్తం

Update: 2023-02-09 10:52 GMT
మనకు పడనోడు ఉంటాడు. కానీ.. వాడికి అనుకోని రీతిలో కష్టం వచ్చి పడుతుంది. అలాంటి వేళలో.. తనకు పడనోడికి వచ్చి పడిన ఇబ్బందిని చూస్తే.. వీడికి ఆ మాత్రం శాస్తి జరగాల్సిందే అనుకునే మైండ్ సెట్ ఉంటుంది. కానీ.. భారతదేశ మైండ్ సెట్ అలాంటిది కాదన్న విషయాన్ని మరోసారి నిరూపించింది కేంద్రంలోని మోడీ సర్కారు. పెద్దగా మాటల్లేని.. ఆ మాటకు వస్తే విభేదాలున్నా టర్కీ.. సిరియా దేశాలకు భారత్ అందిస్తున్న అపన్నహస్తం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. భారత్ అసలైన తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు ఆ దేశాల్లోని ప్రజలు గుర్తిస్తున్నారు. మిగిలిన దేశాలు సైతం భారతదేశ వైఖరిఎలా ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నాయి.

అనూహ్యంగా విరుచుకుపడిన భూకంపం నేపథ్యంలో టర్కీ.. సిరియా దేశాల్లో భారీ ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం గురించి తెలిసిందే. ఇప్పటివరకు వస్తున్న వార్తల ప్రకారం తాజాగా చోటుచేసుకున్న భారీ భూకంపం కారణంగా 20 వేలమంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికి భవన శిధిలాల కింద పెద్ద ఎత్తున ఇరుక్కుపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. భూకంపం చోటు చేసుకొని నాలుగు రోజులు గడుస్తున్న నేపథ్యంలో.. ఆపదలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఉన్న అవకాశాలు తగ్గిపోతున్న పరిస్థితి.ఈ నేపథ్యంలో సహాయక చర్యలు మరింత వేగంగా సాగాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది.

ఇదిలా ఉంటే.. భూకంపంతో తల్లిడిల్లిపోయిన టర్కీ (తుర్కియా).. సిరియా దేశాలకు అపన్న హస్తం అందించేందుకు మోడీ సర్కారు పెద్ద ఎత్తున సహాయక చర్యల్ని అందిస్తున్నారు. నిజానికి టర్కీతో భారత్ కు మంచి సంబంధాలు లేవు. కొన్ని విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ.. వారికి కష్టం వచ్చినప్పుడు వారు కోరకుండానే సాయం చేయటానికి ముందుకు వెళ్లే విషయంలో భారత్ కు సాటి వచ్చే వారే లేరని చెప్పాలి. భూకంపంతోచోటు చేసుకున్న పరిణాల నేపథ్యంలో టర్కీకి 101సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ మొదటి టీం ఇప్పటికే అక్కడ చేరుకొని పనులు మొదలు పెటటింది.

ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు.. మందులతో పాటు పరికరాల్ని భారత్ పంపుతోంది. ఇప్పటికే భారత్ నుంచి సహాయ సహకారాలు అందించేందుకునాలుగు విమానాల్లో వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బంది వెళ్లారు. వీరిలో భారత సైన్యానికి సంబంధించిన 54 మంది వైద్యులు.. వైద్య పరికరాలు కూడా వెళ్లాయి.

దాదాపుగా వందేళ్లకు పైనే ఇంతటి విపత్తును టర్కీ చూసింది లేదు. వేలాది భవనాలు పేకమేడల్లా కూలిపోవటం.. అందులో భారీ ఎత్తున ప్రజలు ఇరుక్కుపోయి ఉంటారని భావిస్తున్నారు. వీరికి సాయం అందించేందుకు భారత్ నుంచి వెళ్లిన సహాయ టీంలు వేగవంతంగా పనులు చేపడుతున్నయి. దీనిపై టర్కీ సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. భారత్ నిజమైన స్నేహితుడిగా అభివర్ణించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. విభేదాలు ఉన్న టర్కీకి సాయం చేయటమా? అన్న ప్రశ్నకు స్పందించారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్. భౌగోళిక.. రాజకీయ పరిస్థితులు నిత్యం మారుతూ ఉంటాయని.. అయినప్పటికీఅన్ని దేశాలతో స్థిరమైన సంబంధాల్ని కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాజా పరిణామాల్ని చూసినప్పుడు భారతీయుడు ఎవరైనా సరే.. మేరా భారత్ మహాన్ అనుకోకుండా ఉండలేరు. అంతేకాదు.. తాజాగా భారత్ స్పందిస్తున్న తీరుకు సైతం పలు దేశాల వారు ప్రశంసలు వ్యక్తం చేసే పరిస్థితి. ఒక భారతీయుడిగా ఇంతకు మించి కావాల్సిందేముంది?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News