పొలిటిక‌ల్‌.. 'అగ్నిప‌థ్‌' మోడీకి కాక రేగుతోంది!

Update: 2022-06-16 10:30 GMT
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్‌" పొలిటిక‌ల్ కాక రేపుతోంది.  స్వల్పకాలానికి జవాన్లను నియమించుకునే విధానంపై రాజ‌కీయ దుమారం రేగింది. దీనిపై రాజకీయ నాయకులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.  రాహుల్ గాంధీ ఈ పథకాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 'భారత్‌కు రెండు వైపుల నుంచి శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్న ఇలాంటి సమయంలో ఈ అగ్నిపథ్‌ పథకం మన సాయుధ బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీ పడటాన్ని బీజేపీ సర్కార్‌ మానుకోవాలి' అని రాహుల్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా అగ్నిపథ్‌పై విమర్శలు చేశారు. సైనికుల సుదీర్ఘకాల సేవలను భారత ప్రభుత్వం భారంగా భావిస్తోందా? అంటూ ప్రశ్నించారు. తాజాగా, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సైతం కేంద్రంపై విమర్శలు చేశారు. ఈ పథకం వల్ల గ్రామీణ యువత నష్టపోతారని అన్నారు. "చాలా రోజుల నుంచి రిక్రూట్మెంట్ను నిర్వహించకుండా... ఇప్పుడు కేంద్రం కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది.  దేశ యువత దీని పట్ల అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు." అని వ్యాఖ్యానించారు.

ఆర్మీతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో పెన్షన్ ప్రయోజనాలను పూర్తిగా రద్దు చేసేందుకే కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని మాయావ‌తి విమ‌ర్శించారు.  గ్రామీణ కుటుంబాలు, యువతకు ఈ నిర్ణయం మంచిది కాదు అని వరుస ట్వీట్లు చేశారు మాయావతి.

ఇక‌, బీజేపీ సొంత ఎంపీ వరుణ్ గాంధీ సైతం ఈ పథకంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. అగ్నిపథ్ స్కీమ్.. యువతలో మరింత అసంతృప్తి రాజేస్తుందని అన్నారు. దీనిపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు.

నాలుగేళ్ల తర్వాత 75 శాతం మంది సైనికులు నిరుద్యోగులుగా మారతారని ఆరోపించారు. ఆ తర్వాత ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. సాధారణ సైనికులే 15ఏళ్ల తర్వాత రిటైర్ అవుతున్నా రని.. అలాంటిది నాలుగేళ్లకే ఉద్యోగం నుంచి దిగిపోయిన వీరిని నియమించుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపకపోతే ఎలా అని ప్రశ్నించారు.

అగ్నిపథ్ పథకం దేశ భవిష్యత్కు ప్రాణాంతకంగా మారుతుందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దీన్ని అత్యంత నిర్లక్ష్య విధానంగా అభివర్ణించారు. దేశ భద్రత అంటే స్వల్పకాలిక సమస్య కాదని.. చాలా సుదీర్ఘమైన విషయమని అన్నారు. దీంతో మోడీ స‌ర్కారుకు ముప్పేట అగ్గి రాజుకున్న‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News