ఐదేళ్లలో ప్రచారం కోసం మోడీ సర్కారు అన్ని వేల కోట్లు ఖర్చు చేసిందా?

Update: 2022-07-29 04:19 GMT
ప్రజాధనాన్ని ఆచితూచి అన్నట్లుగా ఖర్చుచేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ ఇమేజ్ ను పెంచుకోవటానికి ఇచ్చే ప్రాధాన్యత.. ప్రజాధనాన్ని సంరక్షించే విషయంలో అంతగా పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

ప్రజాధనాన్ని పప్పు బెల్లాలు మాదిరి సంక్షేమ పథకాలు.. ఉచితాలతో ఖర్చు చేస్తున్న వైనం తెలిసిందే. దీనితో పాటు.. తమ ఘనతను చాటి చెప్పేందుకు వీలుగా భారీ ఎత్తున ప్రచార ప్రకటనలు ఇవ్వటంలో మోడీ సర్కారు ఎంతలా ఖర్చు చేస్తుందన్న విషయానికి సంబంధించిన వివరాలు తాజాగా వెలుగు చూశాయి.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభలో సభ్యుడు ఒకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఇంతకూ సదరు ఎంపీ అడిగిన ప్రశ్న ఏమంటే.. గడిచిన ఐదేళ్లలో దేశంలోని ప్రింట్.. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల రూపంలో చేసిన ఖర్చు ఎంత? అన్న ప్రశ్నను సంధించారు.

దీనికి సమాధానం ఇచ్చిన కేంద్రం.. 2017 నుంచి ఇప్పటివరకు (ఐదేళ్ల వ్యవధిలో) ప్రింట్.. ఎలక్ట్ట్రానిక్ మీడియాలో యాడ్స్ రూపంలో పెట్టిన ఖర్చు అక్షరాల రూ.3339.49 కోట్లుగా వెల్లడించింది. ఇంత భారీ మొత్తాన్ని కేవలం మోడీ సర్కారు ప్రమోషన్ కోసం ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇందులో ప్రింట్ మీడియాకు అత్యధికంగా రూ.1756.48 కోట్లు.. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం రూ.1583.01 కోట్ల చొప్పున ఖర్చు చేసినట్లుగా వెల్లడించారు.

అంటే.. ఏడాది సుమారు రూ.650 కోట్ల చొప్పన ఖర్చు చేసినట్లుగా చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టే ఖర్చుతో పోలిస్తే.. ఇదేమీ పెద్ద ఖర్చుగా కనిపించదు. ఈ మధ్యనే ఏపీలోని జగన్ సర్కారు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించి.. దాని ప్రచారం కోసమే రూ.60 కోట్ల వరకు ఖర్చు చేస్తున్న వైనం వార్తల్లో వచ్చింది.

తెలంగాణలోనూ ప్రకటనల మీద భారీగా ఖర్చు చేయటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పెట్టే ఖర్చుతో పోలిస్తే.. మోడీ సర్కారు ఐదేళ్లలో దేవ వ్యాప్తంగా చేసిన ఖర్చు తక్కువనే మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News