ఇమ్రాన్ గెలుపు వెనుక సీక్రెట్ అదేన‌ట‌!

Update: 2018-08-06 16:50 GMT
 దాయాది పాకిస్థాన్ ప్ర‌ధానిగా మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ విజ‌యం సాధించ‌టం వెనుక వ్యూహ‌మేంది? క‌్రికెట‌ర్ గా త‌న జ‌ట్టును ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా తీర్చిదిద్దిన ఇమ్రాన్‌.. తాజాగా ఎన్నిక‌ల విజ‌యాన్ని ఎలా సాధించారు. గ‌త ఓట‌మి నుంచి ఆయ‌న నేర్చుకున్న పాఠాలేంటి?  ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలిచి దేశ ప్ర‌ధాని కావ‌టం వెనుక ఆయ‌న వ్యూహం ఏమిటి?  ఏ అంశం ఆయ‌న్ను ప్ర‌ధాని పీఠానికి ద‌గ్గ‌ర చేసింది?   పోల్ మేనేజ్ మెంట్ లో ఎవ‌రు ఆయ‌న‌కు స్ఫూర్తి? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానాలు రావ‌ట‌మే కాదు.. ఆస‌క్తిక‌రంగా అనిపించ‌టం ఖాయం.

ఇప్పుడు త‌న పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చిన ఇమ్రాన్‌.. 2013లో రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసిన‌ప్పుడు ఆయ‌న‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. తెహ్రీక్ - ఇ- ఇన్సాఫ్ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీకి పాక్ ప్ర‌జ‌లు ఆశించినంత విజ‌యాన్ని ఆయ‌న‌కు ఇవ్వ‌లేదు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో తాను చేసిన పొర‌పాట్లు ఏమిటి?  ఏ అంశాల‌పై తాను దృష్టి సారించాల‌న్న అంశాన్ని ఇమ్రాన్‌ కు 2014లో జ‌రిగిన భార‌త సార్వ‌త్రిక ఎన్నిక‌లు చెప్ప‌క‌నే చెప్పేశాయి.

గుజ‌రాత్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న మోడీని.. దేశ ప్ర‌ధానిగా మార్చటంలో కీల‌క‌భూమిక పోషించిన సాంకేతిక‌త‌ను న‌మ్ముకోవాల‌న్న విష‌యాన్ని ఇమ్రాన్ గుర్తించారు. అదే.. ఆయ‌న‌కు తాజా విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టిన‌ట్లుగా చెప్పాలి. డిజిట‌ల్ ప్ర‌చారంతో నిత్యం ఓట‌ర్ల‌కు అందుబాటులో ఉంట‌మే కాదు వారు కోరుకునే అంశాల‌ను త‌మ పార్టీతో ముడిపెట్టి ప్ర‌చారం చేయ‌టం.. తాము అధికారంలోకి వ‌స్తేనే వాటికి ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్న ఆశ‌ను క‌ల్పించ‌టంలో ఇమ్రాన్ స‌క్సెస్ అయ్యారు.

అదే స‌మ‌యంలో ఇమ్రాన్ కు తారిక్ దిన్.. షాజాద్ గుల్ అనే ఇద్ద‌రు సాంకేతిక నిపుణులు ఇమ్రాన్ కోసం ఒక యాప్ ను అభివృద్ది చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఓట‌ర్ల డేటా బ్యాంకును ఏర్పాటు చేసిన ఈ మొబైల్ యాప్ ఆశించిన దాని కంటే ఎక్కువ ఫ‌లితాల్ని అందించింది. 2015లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో ఈ యాప్ త‌న స‌త్తా చాటింది. యాప్ లో ఓట‌ర్ ఐడీ నంబ‌రును న‌మోదు చేసిన వెంట‌నే వారు ఏ ప్రాంతంలో ఉంటారు?  వారి క‌టుంబ నేప‌థ్యం ఏమిట‌న్న విష‌యాలు తెర మీద‌కు వ‌స్తాయి. దీనికి త‌గ్గ‌ట్లు సీఎంఎస్ (కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టం) మీద ప‌ని చేసే నిపుణులు వారికి అవ‌స‌ర‌మైన డేటాను అంద‌జేస్తారు. నిరంత‌రం ఓట‌ర్ల‌తో అనుసంధానం అయ్యేలా ఈ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ప్ర‌భావం దాదాపు 5 కోట్ల మంది మీద ప‌డిందంటే.. ఇమ్రాన్ విజ‌యానికి ఈ యాప్ కీల‌కంగా మారింద‌ని చెప్పాలి. సాంకేతిక ద‌న్ను ఇమ్రాన్ ను పార్టీ అధినేత నుంచి పాక్ ప్ర‌ధానిని చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News