హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలుపు మోడీ మాష్టారికి అలా అర్థమైందా?

Update: 2021-11-08 05:08 GMT
భారత ప్రధానమంత్రి.. కేంద్రంలో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న కమలనాథులకు దిశా నిర్దేశం చేసే నరేంద్ర మోడీకి అందే ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా తాజాగా ఆయన నోటి నుంచి వెలువడిన వ్యాఖ్యలు చెప్పకనే చెప్పేశాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సాధించిన గెలుపును నరేంద్ర మోడీకి అర్థం కావాల్సిన రీతిలో కాకుండా.. ఎలా అయితే అర్థం కాకూడదో అలానే అర్థమైందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన మోడీ మాటల్ని వింటే.. తెలంగాణ రాష్ట్రంపైనా.. తాజాగా విజయం సాధించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో ఆయనకున్న అవగాహన అంతంత మాత్రమన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.

అధినాయకత్వానికి అందే ఫీడ్ బ్యాక్.. వెళ్లే నివేదికలు ఆయనకు సరైన రీతిలో వెళ్లటం లేదన్న విషయం తాజాగామోడీ మాటల్ని జాగ్రత్తగా వింటే అర్థం కావటమే కాదు.. ఇలాంటి భావన కొత్త తప్పులకు అవకాశం ఇస్తుందని చెప్పక తప్పదు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు చూస్తే.. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న మాట మోడీ నోట రావటం గమనార్హం. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఈటల వ్యక్తిగత ఇమేజ్ కారణమే తప్పించి..బీజేపీకి ఏ మాత్రం క్రెడిట్ తీసుకోకూడదన్న విషయాన్ని మర్చిపోవటం గమనార్హం.

రాజకీయ నేతలు ఎవరైనా సరే.. వారి స్థాయి ఇంకేం ఉన్నా.. జరిగిన అంశాల్ని తమకు అనుగుణంగా మార్చుకొని చెప్పటం అలవాటే. తాజాగా మోడీ మాటలు సైతం ఇదే రీతిలో ఉండటం విశేషం. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల విజయం చాలా ప్రత్యేకమైనది. ఆ మాటకు వస్తే.. హుజూరాబాద్ కంటే కూడా దుబ్బాక విజయం చాలా కీలకమైనదని చెప్పాలి. అదే సమయంలో జీహెచ్ఎంసీలో సాధించిన సీట్లు సైతం బీజేపీ ఖాతాలో వేసుకోవాల్సిందే. అంతేకాని.. హుజూరాబాద్ గెలుపు మాత్రం బీజేపీ ఖాతాలోకి వెళ్లదన్నది మర్చిపోకూడదు.

మోడీ మాటల్ని విన్నప్పుడు.. ఆయనకు వాస్తవం తెలీదా? ఆయన సైతం మిగిలిన వారి మాదిరి తమ బలాన్ని ఎక్కువ చేసి ఊహించుకుంటున్నారా? అన్న సందేహం కలుగక మానదు. హుజూరాబాద్ ఉప పోరులో ఈటల గెలుపు చెప్పే నిజం ఏమంటే.. కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకతను ప్రదర్శించేందుకు బలమైన నేత ఎవరైనా సరే.. వారి పార్టీలతో సంబంధం లేకుండా గెలిపించటమే ముఖ్యమన్నట్లుగా తెలంగాణ ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నది వాస్తవం.

అయితే.. దానికి ఏ పార్టీ నేతలు తమ పార్టీ గొప్పతనంగా ఫీల్ కావటం తప్పే అవుతుంది. ఇప్పటికైనా తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు ఏమిటి? అన్న విషయం మీద మోడీ మాష్టారు సరైన ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి. హుజూరాబాద్ విజయం ఈటలకు మాత్రమే సొంతం తప్పించి.. అందులో బీజేపీ వాటా దాదాపుగా లేనట్లే. .ఈ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.


Tags:    

Similar News