షాకింగ్ రిపోర్ట్... బాలుడి పుర్రెలో బుల్లెట్ గాయాలు, చాతిపై కత్తిగాట్లు!

నవంబర్ 11న మైతేయ్ వర్గానికి చెందిన ఆరుగురు అపహరణకు గురైన సంగతి తెలిసిందే.

Update: 2024-11-25 04:46 GMT

మణిపూర్ లోని రావణకాష్టం మండుతూనే ఉంది! ప్రభుత్వాల అలసత్వమో, నిర్లక్ష్యమో, రహస్య కారణమో... కారణాలు ఏవైనప్పటికీ ఇంకా అక్కడ దారుణాలు జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో.. ఇటీవల కిడ్నాపయ్యి, తర్వాత హత్యకు గురైన మహిళలు, చిన్నారుల పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

నవంబర్ 11న మైతేయ్ వర్గానికి చెందిన ఆరుగురు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉండగా.. వీరి మృతదేహాలు నదిలో కొట్టుకురావడం సంచలనంగా మారింది. వీటికి అస్సాంలోని సిల్చర్ వైద్య కళాశాల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా... షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయని అంటున్నారు.

అవును... మణిపూర్ లో ఇటీవల అపహరణకు, అనంతరం హత్యకు గురైన మహిళలు, చిన్నారులను అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని అంటున్నారు. మూడేళ్ల బాలుడు సహా మహిళల మృతదేహాలపై కాల్పుల ఆనవాళ్లతో పాటు కత్తిగాట్లు ఉన్నట్లు వెల్లడైందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... బాలుడి కన్ను కనిపించకపోవడంతో పాటు అతడి పుర్రెలో బుల్లెట్ గాయాలున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో చాతిపై కత్తిగాట్లు, వీపుపై దెబ్బలు, నుదిటిపైనా తీవ్ర గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలిందని చెబుతున్నారు. ఆ బాలుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దొరికిందని తెలుస్తోంది!

ఇదే సమయంలో... బాలుడి తల్లి మృతదేహంపైనా మూడు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు శవపరీక్షలో తేలిందని.. అతడి నానమ్మ శరీరంపైనా ఐదు బుల్లెట్ గాయాలున్నాయని చెబుతున్నారు. ఇందులో రెండు బుల్లెట్లు ఛాతిలో, రెండు భుజంపై నుంచి దూసుకెళ్లగా.. పుర్రెలో ఒకటి గుర్తించారని అంటున్నారు.

మరోపక్క ఈ మృతదేహాలను తీసుకెళ్లడానికి బాధిత కుటుంబాలు నిరాకరించాయని అంటున్నారు. న్యాయం జరిగే వరకూ మృతదేహాలను తీసుకెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని అంటున్నారు. అయితే... న్యాయం చేస్తామని అధికారులు భరోసా ఇచ్చి, ఒప్పించడంతో మణిపూర్ లోని జిరిబాంకు మృతదేహాలను తరలించారు!

కాగా... జాతుల మధ్య వైరంతో సుమారు ఏడాదిన్నర కాలంగా అట్టుడుకుతోన్న మణిపూర్ లో ఇటీవల మళ్లీ హింస చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది మే నుంచి ఇప్పటి వారకూ 258 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో మిలిటెంట్లు కూడా ఉన్నారని వెల్లడించింది.

Tags:    

Similar News